స్పేస్‌ ఎక్స్‌ ‘చంద్రయాన్‌’లో భారత నటుడు దీప్‌ జోషి

15 Dec, 2022 05:44 IST|Sakshi

వాషింగ్టన్‌: ‘డియర్‌ మూన్‌’ పేరుతో ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్‌ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అంతరిక్ష యాత్రకు వెళ్లే బృందంలో బాల్‌వీర్‌ టీవీ షోతో దేశవ్యాప్త క్రేజ్‌ సాధించిన భారత నటుడు దీప్‌ జోషి చోటు దక్కించుకున్నారు! చంద్రుని సమీపానికి స్పేస్‌ ఎక్స్‌ చేపడుతున్న తొలి వాణిజ్య అంతరిక్ష యాత్ర డియర్‌ మూన్‌. దాంట్లో అందుబాటులో ఉన్న టికెట్లన్నింటినీ జపాన్‌ కుబేరుడు యసాకు మజావా కొనుగోలు చేశారు. తన వెంట పలు రంగాల నుంచి 8 మంది ప్రఖ్యాత కళాకారులను తీసుకెళ్లాలని తొలుత భావించినా చివరికి వారిని ఇంటర్వ్యూల ద్వారా ఎంచుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 10 లక్షల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు.

ఏడాదిన్నర పాటు అనేకానేక వడపోతల అనంతరం జోషితో పాటు ప్రఖ్యాత బ్రిటిష్‌ ఫొటోగ్రాఫర్‌ కరీం ఇలియా, అమెరికా నుంచి ప్రముఖ డీజే, నిర్మాత స్టీవ్‌ అవోకీ, సినీ దర్శకుడు బ్రెండన్‌ హాల్, యూట్యూబర్‌ టిమ్‌ డాడ్, దక్షిణ కొరియాకు చెందిన కె–పాప్‌ మ్యుజీషియన్‌ షొయ్‌ సెయంగ్‌ హుయాన్‌ (టాప్‌) విజేతలుగా నిలిచారు. వీరంతా వచ్చే ఏడాది స్పేస్‌ ఎక్స్‌ స్టార్‌షిప్‌ వెహికిల్‌లో మజావాతో పాటు 8 రోజుల పాటు అంతరిక్షంలో విహరిస్తారు. 3 రోజులు చంద్రుని చుట్టూ తిరుగుతారు. 22 ఏళ్ల జోషి ఈ బృందంలో అత్యంత పిన్న వయస్కుడు. 2000 నవంబర్‌లో గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో పుట్టారు. పలు గుజరాతీ సినిమాల్లో నటించారు. ‘‘దేవ్‌ యువోత్సాహం తమకెంతో స్ఫూర్తినిస్తుంది. అందుకే ఆయన్ను ఎంపిక చేసుకున్నాం’’ అని మజావా పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు