రాష్ట్రేతర తెలుగు సలహా మండలి ఏర్పాటుచేయాలి

3 Nov, 2020 21:17 IST|Sakshi

బెంగళూరు: సరిహద్దు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, ఒరిస్సా, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో ఎంతోమంది తెలుగువారు స్థిరపడి జీవిస్తున్నారని బెంగళూరు సీపీబ్రౌన్ సేవాసమితి అధ్యక్షులు ఇడమకంటి లక్ష్మిరెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడి 67 ఏళ్లు దాటిన సందర్భంగా సీపీబ్రౌన్‌ సమితి వారు నిర్వహించిన కార్యక్రమంలో  ఆ సమితి అధ్యక్షులు లక్ష్మిరెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయా రాష్ట్రాలతో పాటు ఢిల్లీ , ఛతీస్‌ఘడ్‌, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలలో కూడా తెలుగు వారు గణనీయంగా వున్నారన్నారు. కాలక్రమేనా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపార రీత్యా వలస వెళ్లిన వారు, నిర్మాణ రంగంతో పాటు విద్యా -వైద్య రంగాలలో కూడా తెలుగువారు తమ ముద్రను వేసుకున్నారన్నారు. వీరంతా అక్కడ తమ తెలుగువారి సంస్కృతీ సాంప్రదాయాలతో బాటు భాషా సంప్రదాయాలను కాపాడుకొంటూ వస్తున్నారన్నారు. మిత్ర రాష్ట్రాలలో ఉన్నతెలుగువారి బాగోగులను, భాషా సంప్రదాయాలను కాపాడవలసిన భాద్యత తెలుగు ప్రభుత్వాల మీద వుందని ఆయన అన్నారు. తెలుగు వారంటే తమ యేలుబడిలో వున్న ప్రజలే కాదని,  ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల చిరునామాలుగా జీవిస్తున్న ఇతర రాష్ట్రాల, దేశాలకు కూడా వలస వెళ్లిన తెలుగు వారి క్షేమాన్ని కూడా చూడవలసిన కనీస కనీస భాద్యత తెలుగు ప్రభుత్వాల మీద ఉందని అక్ష్మిరెడ్డి పేర్కొన్నారు. 

అంతేగాక ‘ఒక్కో రాష్ట్రంలో వుండే సమస్యలు పరిస్థితులు ఒక్కో రకంగా ఉంటాయి. వాటన్నిటి పరిష్కారం ఒకే రకంగా ఉండవు. వాటిని ప్రత్యేకంగా అధ్యయనం చేసి పరిష్కారాలు కనిపెట్టాలి. అలాగే వీటన్నిటి పరిష్కారానికి తెలుగు ప్రభుత్వాలు ప్రత్యేకంగా రాష్ట్రేతర సలహా మండలిని ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేయాలి. ప్రతి రాష్ట్రం నుంచి ఒకరు ఇద్దరు చొప్పున సభ్యులను ఈ సలహా మండలిలోకి తీసుకోవాలి భాషా పరమైన సమస్యలున్నా ఇంకా ఇతర ఏ సమస్యలు ఉన్నా. ఆయా ప్రభుత్వాలతో చర్చించి మన తెలుగువారికి మేలు కలిగేలా చర్యలు తీసుకోవాలి. ఉదాహరణకు కర్ణాటకలో తెలుగు బడుల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు పదవీవిరమణ పొందితే ఖాళీ అయిన ఉద్యోగానికి ఆ ప్రభుత్వం తిరిగి ఎవరిని నియమించటం లేదు. కారణం మన తెలుగు వారిలోనే సఖ్యత లేకపోవడం. కర్ణాటకలోని అల్పసంఖ్యాకుల మాధ్యమాలలో ఒక్క తెలుగుకే ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరి ఏ ఇతర భాషలైన తమిళం, మలయాళం, మరాఠి భాషలకు ఈ ఇబ్బదులు లేవు ఆయా భాషల పెద్దలు సంఘటితంగా వుండి వారి వారి భాషలకు అండగా నిలుస్తున్నారు. వారికి వారి వారి రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం ఇస్తున్నాయి’ అని అయన అన్నారు.  ‘‘కర్ణాటక ప్రభుత్వాలతో మాట్లాడి వారి పిల్లలకు ఇబ్బందులు లేకుండా చేసుకుంటున్నారు. తెలుగువారికి ప్రస్తుతం ఉన్న పరిస్థితి త్రిశంకు స్వర్గంలా ఉంది. తెలుగు రాష్ట్రం రెండుగా అయ్యాక. ఇతర రాష్ట్రాల సమస్యలను ఏ ప్రభుత్వానికి చెప్పుకోవాలి, ఎవరి వద్దకు వెళ్లాలని అనేది పెద్ద సమస్యగా మారింది’ ఆయన పేర్కొన్నారు.  

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన పథకాలు దేశంలోనే చాల గొప్ప పథకాలు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమ్మఒడి, జగనన్న విద్యా కానుక వంటి పథకాలను ఇతర రాష్ట్రాలలో తెలుగు మాధ్యమాలలో చదువుకుంటున్న ప్రవాస తెలుగు వారి పిల్లలకు కూడా వర్తించేలా చూడాలన్నారు. అంతేగాక తెలుగు వారి పండుగలైన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం, తెలుగు భాషా దినోత్సవం ఇంకా ఎందరో తెలుగు తేజాల అధికారిక ప్రకటిత పండుగలు జరుపుకోడానికి ఆర్ధిక సహాయాన్ని కూడా చేయవలసిన అవసరం ఎంతైనా తెలుగు ప్రభుత్వాలపైన ఉందన్నారు. కాబట్టి సగటు రాష్ట్రేతర తెలుగు వారి సమస్యలను ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ అటు తెలంగాణ ప్రభుత్వం కానీ రాష్ట్రేతరులకు అనుకూలంగా సత్వరమే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞపి చేశారు.

మరిన్ని వార్తలు