ఛత్రపతి శివాజీ ప్రారంభించారు.. మోదీ కొనసాగిస్తున్నారు: అమిత్‌ షా

20 Feb, 2023 06:08 IST|Sakshi

పుణే: మొగలులు, ఇతర విదేశీ దురాక్రమణదారులు ధ్వంసం చేసిన ఆలయాలను ఛత్రపతి శివాజీ పునర్నిర్మించారని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా శ్లాఘించారు. మరాఠా యోధుడు ప్రారంభించిన ఆ పనిని ప్రధాని మోదీ నేడు కొనసాగిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడేందుకే శివాజీ తన జీవితాన్ని పణంగా చెప్పారన్నారు. పుణేలోని నర్హే–అంబేగావ్‌లో శివాజీ జీవితగాథ ఆధారంగా ‘శివసృష్టి’ ఇతివృత్తంతో 21 ఏకరాల్లో ఏర్పాటవుతున్న పార్క్‌ మొదటి దశను అమిత్‌ షా ప్రారంభించారు. ‘శివాజీ అనంతరం ధ్వంసమైన ఆలయాల పనర్నిర్మాణాన్ని ప్రధాని కొనసాగిస్తున్నారు. పలు దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నారు’అన్నారు.

శివాజీ ఆశీస్సులతో విల్లు, బాణం: షిండే
ఛత్రపతి శివాజీ ఆశీస్సులతో తమకు శివసేన ఎన్నికల గుర్తు ‘విల్లు, బాణం’ లభించిందని కార్యక్రమంలో పాల్గొన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే చెప్పారు. శివసృష్టి ప్రాజెక్టును అద్భుతంగా తీర్చిదిద్దుతామని షిండే చెప్పారు. మహారాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధాని మోదీ, అమిత్‌ షా తమ వెనక కొండంత అండగా నిలిచారని శనివారం ఆయన పేర్కొనడం తెలిసిందే.

మరిన్ని వార్తలు