పదో తరగతి విద్యార్థిని మృతి.. ఆస్పత్రి ముట్టడి

4 Nov, 2022 07:20 IST|Sakshi
మృతి చెందిన నందిని

సాక్షి, చెన్నై(అన్నానగర్‌): మన్నడి ప్రాంతంలోని ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరిన పదో తరగతి విద్యార్థిని చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె మృతి చెందినట్టు ఆరోపిస్తూ బాలిక తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేపట్టారు.

వివరాల్లోకి వెళితే.. చెన్నై తండయార్‌ పేట ఎంపీటీ కాలనీకి చెందిన రమేష్‌ చెన్నై పోర్టులో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతనికి భార్య వసంతి, కుమార్తె నందిని (15) ఉన్నారు. కుమార్తె నందిని తండయార్‌ పేటలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. రమేష్, వసంతి దంపతులకు నందిని ఏకైక సంతానం కావడంతో అల్లారుముద్దుగా పెంచారు. ఈ స్థితిలో నందినికి కడుపునొప్పి రావడంతో రెండు రోజుల క్రితం చెన్నైలోని మన్నడి ప్రాంతంలో ఉన్న ఒక ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు.

అక్కడ చికిత్స పొందుతూ నందిని బుధవారం సాయంత్రం చికిత్స ఫలించక మృతి చెందింది. ఈ వార్త విని దిగ్భ్రాంతి చెందిన తల్లిదండ్రులు కూతురి మృత దేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ కుమార్తె చనిపోయిందంటూ నందిని తల్లిదండ్రులు, బంధువులు ప్రైవేట్‌ ఆస్పత్రిని ముట్టడించి డాక్టర్‌తో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారికి సర్ది చెప్పి పంపించారు.

మరిన్ని వార్తలు