రూ.18 లక్షల నగదును చెద పురుగులు తినేశాయి

29 Sep, 2023 06:04 IST|Sakshi

లక్నో: బ్యాంకు లాకర్‌లో దాచిన రూ.18 లక్షల నగదును చెద పురుగులు తినేసిన సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మొరాబాబాద్‌లో జరిగింది. మొరాదాబాద్‌కు చెందిన మహిళ అల్కా పాఠక్‌ తన కుమార్తె పెళ్లి కోసం పొదుపు చేసిన రూ.18 లక్షల నగదును గత ఏడాది అక్టోబర్‌లో బ్యాంకు ఆఫ్‌ బరోడా శాఖలోని లాకర్‌లో భద్రపర్చింది.  లాకర్‌ అగ్రిమెంట్‌ను నవీకరించుకోవాలని, కేవైసీ వివరాలు ఇవ్వాలని ఇటీవల బ్యాంకు సిబ్బంది ఆమెకు ఫోన్‌ చేసి చెప్పారు.

అల్కా పాఠక్‌ బ్యాంకుకు వెళ్లి తన లాకర్‌ను తెరిచి చూసు కోగా, చెత్తాచెదారమే కనిపించింది. నగదును చెదపురుగులు కొరికేసి ముక్క లు ముక్కలు చేశాయి. మొత్తం సొమ్మంతా పనికి రాకుండా పోయింది. ఈ ఘటనపై బ్యాంకు సిబ్బంది స్పందించారు. ఉన్నతాధికారులకు ఈ విషయం తెలియజేశామని అన్నారు. అల్కా పాఠక్‌కు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. ఆర్‌బీఐ తాజా నిబంధనల ప్రకారం.. బ్యాంకు లాకర్లలో నగదు భద్రపర్చడానికి వీల్లేదు. నగలు, డాక్యుమెంట్లు మాత్రమే భద్రపర్చుకోవాలి. 

మరిన్ని వార్తలు