భయానకం: విరిగిపడ్డ కొండచరియలు.. 9 మంది మృతి!

25 Jul, 2021 16:51 IST|Sakshi

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో కిన్నౌర్‌ జిల్లా సంగాల్‌ లోయ వద్ద ఘోరసంఘటన చోటుచేసుకుంది. కొండచరియలు  విరిగిపడి 9 మంది మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. బండరాళ్ల ధాటికి సమీపంలో ఉన్న వంతెన కూలిపోయింది. అంతేకాకుండా దగ్గరలో ఉన్న వాహనాలు, విశ్రాంతి​ గదులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఒక్కసారిగా ఆ ప్రాంతంలో భయానక దృశ్యాలు ఏర్పడ్డాయి. ఈ సంఘటన ఆదివారం మధ్యాహ్నం 2.15 గంటల సమయంలో జరిగింది.

గత వారం భారీగా కురిసిన వర్షాల కారణంగా కొండచరియలు విరిగి పడ్డాయని స్థానిక అధికారులు పేర్కొన్నారు. ప్రమాదాలకు గురయ్యే పలు ప్రాంతాలకు పర్యాటకులు వెళ్లకూడదని అధికారులు హెచ్చరించారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి రెస్క్యూ సిబ్బంది చేరుకొని క్షతగాత్రులకు వైద్య సహయాన్ని అందిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్‌ అబిద్‌ హూస్సేన్‌ పేర్కొన్నారు. హిమాచల్ ప్రదేశ్ లో ఆకస్మిక వరదలు సంభవించిన కొద్ది రోజుల తరువాత ఈ సంఘటన జరిగింది. గత వారం భారీ వర్షపాతం కారణంగా ఆకస్మిక వరదలు,  కొండచరియలు విరిగిపడి మరణించిన వారి సంఖ్య 13 కు చేరింది.

మరిన్ని వార్తలు