ఉగ్రమూకల కొత్త యాప్‌ బాట

25 Jan, 2021 01:52 IST|Sakshi

2జీ వేగంతో ఉత్తమ ఫలితాలనిచ్చే యాప్‌లు

డివైజ్‌ ఎన్క్రిప్షనతో మరింత సెక్యూరిటీ రెచ్చిపోతున్న ఉగ్రవాదులు

శ్రీనగర్‌: ఉగ్రమూకలు సరికొత్త పన్నాగాలకు తెరలేపుతున్నాయి. ఎన్‌క్రిప్షన్‌ సదుపాయం ఉన్నప్పటికీ వాట్సాప్, ఫేస్‌బుక్‌ మెసెంజర్‌ వంటి యాప్‌లను వాడకుండా మరింత ఎన్క్రిప్షన్‌ ఉంటూనే తక్కువ నెట్‌వర్క్‌లోనూ సమర్ధవంతంగా పని చేయగల యాప్‌ల వైపు మొగ్గుచూపుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యేకించి 3 యాప్‌లను ఉగ్రవాదులు ఉపయోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.  

ఆ మూడే ఎందుకు ?
భద్రతా కారణాల రీత్యా ఆయా యాప్‌ల పేర్లను అధికారులు బయటపెట్టలేదు. అయితే ఆ మూడు యాప్‌లలో ఒకటి అమెరికా, రెండోది యూరోప్, మూడోది టర్కీకి చెందిన నిపుణులు తయారు చేసినవని వెల్లడించారు. ఈ యాప్‌లో ఎండ్‌ టు ఎండ్‌ డివైజ్‌ ఎన్క్రిప్షన్‌ ఉంటోంది. ప్రత్యేకించి ఇటీవల భారత్‌లో జరిగిన ఉగ్ర ఎన్‌కౌంటర్లలో మరణించిన వారి మొబైల్‌ ఫోన్లను పరిశీలించిన అధికారులకు టర్కీ యాప్‌ను ఉపయోగిస్తున్నట్లు ఆధారాలు లభించాయి.

2జీ నెట్‌వర్క్‌ కోసం...
కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత చాలా కాలం పాటు ఆ ప్రదేశాల్లో ఇంటర్నెట్‌ సౌకర్యం నిలిపేశారు. అనంతరం కేవలం 2జీ నెట్‌వర్క్‌ను మాత్రమే అందుబాటులోకి తెచ్చారు. 2జీ వేగంలో ఉత్తమ ఫలితాన్ని ఇవ్వగల టర్కీ యాప్‌ వైపు ఉగ్రవాదులు మొగ్గు చూపుతున్నారని అధికారులు గుర్తించారు. ఈ యాప్‌లు కూడా ఫ్రీ సర్వీసులను అందించడం గమనార్హం.

ఫోన్‌ నంబర్‌ అక్కర్లేదు
ఉగ్రవాదులు ఉపయోగిస్తున్న ఈ మూడు యాప్‌లలో ఒకదానికి అసలు మొబైల్‌ నంబర్‌ కూడా అవసరం లేకుండానే రిజిస్టర్‌ చేసుకొని సమాచారం పంచుకోవచ్చు. ఒకరకంగా ఇది వర్చువల్‌ సిమ్‌లాంటి టెక్నాలజీతో పనిచేస్తుంది. పుల్వామా–2019 ఘటనలోనూ ఇలాంటి వర్చువల్‌సిమ్‌ కార్డులను దాదాపు 40 వరకూ ఉపయోగించినట్లు అధికారులు గుర్తించారు. ఆ ఘటనలో 40 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు