ప్రజాస్వామ్యానికి పరీక్షా సమయం

16 Aug, 2020 05:09 IST|Sakshi

కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ

న్యూఢిల్లీ: భారత ప్రజాస్వామ్యానికిది పరీక్షా సమయమని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. ప్రశ్నించడానికి, విభేదించడానికి, జవాబుదారీతనం గురించి అడగడానికి తగిన స్వేచ్ఛ ఉందా? అని ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాలని తన స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో ఆమె కోరారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ప్రజాస్వామ్య విలువలు క్రమంగా బలపడుతూ వచ్చాయన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగ విలువలు, తరతరాల సంప్రదాయాలకు విరుద్ధంగా  ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ప్రజాస్వామ్యానికిది పరీక్షా సమయమని అన్నారు. ‘రాయడానికి, మాట్లాడటానికి, ప్రశ్నించడానికి, విభేదించడానికి, సొంత అభిప్రాయాలు కలిగి ఉండటానికి, జవాబుదారీతనాన్ని కోరడానికి నేడు స్వాతంత్య్రం ఉందా?’అని సోనియా ప్రశ్నించారు.

దేశంలో ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛను కాపాడటానికి బాధ్యతాయుత ప్రతిపక్షంగా తాము ప్రతి ప్రయత్నం చేస్తామన్నారు. ఈ రోజు యావత్‌ ప్రపంచం కరోనా మహమ్మారితో సతమతమవుతోంది. మనమంతా కలిసికట్టుగా దీన్ని జయించి ప్రపంచానికి ఒక ఉదాహరణగా నిలవాలి.  గల్వాన్‌ లోయలో చైనాతో ఘర్షణలను ప్రస్తావిస్తూ... ‘కల్నల్‌ సంతోష్‌బాబుతో సహా 20 మంది ప్రాణత్యాగం చేసి 60 రోజులు అవుతోంది. వారి ధైర్యసాహసాలకు సెల్యూట్‌ చేస్తున్నాను. చైనా దురాక్రమణలను తిప్పికొట్టి దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడటమే మనం వారికిచ్చే ఘన నివాళి’అని సోనియా పేర్కొన్నారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా