Thackeray Vs Shinde: షిండే వర్గంలో అసంతృప్తి.. 22 మంది ఎమ్మెల్యేలతో సహా..!

30 May, 2023 17:00 IST|Sakshi

ముంబై: శివసేనను రెండుగా చీల్చి, బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పరిచిన ఏక్‌నాథ్ షిండేకు ఇప్పుడు సొంత పార్టీ నేతల నుంచి తలనొప్పులు మొదలయ్యాయి. బీజేపీతో పొసగని తన ఎమ్మెల్యేలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో షిండే వర్గంలోని 22 మంది ఎమ్మెల్యేలతో సహా 9 మంది ఎంపీలు బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నారని ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీ (యూబీటీ)కి చెందిన సామ్నా పత్రిక వెల్లడించింది. ఆ పార్టీలోని ఎమ్మెల్యేలకు బీజేపీతో పొసగడంలేదని పేర్కొంది.

షిండే వర్గంలోని కొంతమంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని యూబీటీ ఎంపీ వినాయక్ రౌత్ తెలిపారు. ఆ పార్టీ నుంచి బయటకు వస్తామని వారు తెలిపినట్లు చెప్పారు. ఎన్డీయే భాగస్వామ్యంలో ఎలాంటి అభివృద్ధి జరగట్లేదని చెప్పినట్లు వెల్లడించారు. బీజేపీ-షిండేకు చెందిన శివసేన భాగస్వామ్యంలోని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే గజానన్ కీర్తికార్ బహిరంగంగానే బీజేపీపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సామ్నా తెలిపింది. బీజేపీ నుంచి అంతర్గతంగా వారు వివక్షను ఎదుర్కొంటునట్లు చెప్పారు. 'మేము 13 మంది ఎమ్మెల్యేలం ఉన్నాం. ఎన్డీయే భాగస్వామ్యంలో మా సమస్యలు పరిష్కారమయ్యేలా లేవు'అని గజానన్ కీర్తికార్ ఇదివరకే అన్నారు. అయితే ఈ పరిస్థితిని షిండే వర్గం తోసిపుచ్చుతోంది.

'వ్యక్తిగత గౌరవాన్ని డబ్బులతో కొనలేం. ఇది మరోసారి రుజువైంది. ఈ సారి 22 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తాం' అని షిండే నేతృత్వంలోని శివసేన నేతలు ఇప్పటికే చెప్పారు. ఎన్డీయే భాగస్వామ్యంలోని షిండే వర్గానికి 22 సీట్లు ఇచ్చే అవకాశాలు దాదాపుగా లేవని సామ్నా తెలిపింది.
      చదవండి:కిడ్నీ సమస్యతో కాంగ్రెస్‌ ఎంపీ కన్నుమూత.. తండ్రి చనిపోయిన మూడు రోజులకే!

మరిన్ని వార్తలు