కార్పొరేటర్‌పై దౌర్జన్యం.. కర్రలు, రాళ్లతో దాడి

26 Nov, 2022 08:30 IST|Sakshi
గాయపడిన కార్పొరేటర్‌ నాడార్, ధ్వంసమైన కారు

సాక్షి, ముంబై: భివండీ పట్టణంలోని లాహోటి కంపౌండ్‌ ప్రాంతంలో గురువారం రాత్రి బీజేపి కార్పొరేటర్‌ నిత్యానంద్‌ నాడార్‌ అలియాస్‌ వాసు అన్నాపై దాడి జరిగింది. తన మర్సిడీస్‌ కారులో కార్యాలయం నుంచి వెళ్తున్న వాసు అన్నాపై కర్రలు, రాళ్లతో దాడి చేయడంతో తలపై, ముఖంపై తీవ్ర గాయాలయ్యాయి. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ ఘటన జరిగిన ప్రాంతంలో సీసీటీవిలో రికార్డు అయినట్లు తెలుస్తుంది. బీజేపీ కార్పొరేటర్‌ వాసు అన్నా తన కార్యాలయంలో పనులు ముగించుకొని రాత్రి సుమారు 9 గంటలకు తన స్వంత మర్సిడీస్‌ కారులో డ్రైవర్, బాడీగార్డ్‌తో కలిసి ఇంటికి బయలుదేరాడు.

తన కార్యాలయానికి కేవలం వంద అడుగుల దూరంలోనే ఓ వ్యక్తి కారుని ఆపడంతో హుటాహుటిన ఓ ముఠా కారుని అడ్డుకొని రాళ్లతో, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కారులో కూర్చున్న నిత్యానంద్‌ నాడార్‌పై కూడా దాడి చేశారు. ఈ ఆకస్మిక దాడిలో నిత్యానంద్‌కు ముఖంపై, తలపై తీవ్రంగా గాయాలయ్యాయి. డ్రైవర్‌ వేగంగా కారును తోలడంతో ఆయన ప్రమాదం నుంచి  బతికి బయటపడ్డారు. కళ్యాన్‌ రోడ్‌లోని హిల్‌ లైఫ్‌ ఆనే ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందిన అనంతరం డిశ్చార్జ్‌  అయ్యారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పట్టణ పోలీస్‌ స్టేషన్‌ సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ చేతన్‌ కాఖడే తో పాటు బృందం సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. సతీష్‌ వావిలాల, కోళి దేవా, ఇబ్రహీం, దాసి సాయినాథ్‌తో పాటు పది పన్నెండు మంది వ్యక్తులు దాడి చేశారని నిత్యానంద్‌ నాడార్‌ పిర్యాదు చేయడంతో పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి సతీష్‌ వావిలాలను అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా, మరికొద్ది నెలల్లో కార్పొరేషన్‌ సార్వత్రిక ఎన్నికలు జరగనుండగా, వార్డు నంబర్‌ 16లో పలువురు అభ్యర్థులు సన్నాహాలు ప్రారంభించడంతో ఆధిపత్య పోరు మొదలైంది.

పార్టీలో వివాదాల వల్లే ఈ దాడి జరిగిందని, పార్టీలో లాబీయింగ్‌ జరుగుతుందని ఈ విషయాన్ని పార్టీ అధిష్టానానికి చెప్పడంవల్లే నాపై దాడి జరిగిందని కార్పొరేటర్‌ నిత్యానంద్‌ నాడార్‌ ఆరోపించారు. సీసీ టీవి ఆధారంగా దాడి చేసిన ముఠాల కోసం పోలీసులు అన్వేషణ ప్రారంభించారు. ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు సీనియర్‌ ఇన్‌స్పెక్టర్‌ చేతన్‌ కాఖడే తెలిపారు. అయితే పారీ్టలోని విభేదాల కారణంగానే ఈ దాడి జరిగిందా అన్న విషయంలో ఇంకా స్పస్టత రాలేదు.  
చదవండి: వణికిస్తున్న వైరస్‌.. మీజిల్స్‌తో మరో బాలుడి మృతి   

మరిన్ని వార్తలు