నన్ను చంపినా బావుండేది..!

29 Sep, 2020 08:45 IST|Sakshi

(వెబ్‌ స్పెషల్‌): ప్రేమించకపోతే ఒకడు చంపేస్తాడు.. ప్రేమిస్తే మరొకడు చంపేస్తాడు.. కూతురు భారమని అసలు పుట్టకుండానే సమాజం చంపేస్తుంది. చచ్చీ చెడి పుట్టినా కన్నకూతుళ్లపైనే లైంగికంగా దాడి చేస్తాడో తండ్రి.  ప్రేమను వెతుక్కున్న కన్నబిడ్డ జీవితాన్ని ఆ ప్రేమ ముసుగులోనే కాలరాస్తాడు మరో తండ్రి.. ఇంకేదీ మనుగడ. ఇంకెక్కడిదీ భారతీయ సంస్కృతి. ఎంతకాలం ఈ ఘోరాలు. సమసమాజం రావాలంటే ఇంకెన్ని కంఠాలు తెగిపడాలి. కౌశల్య.. అమృత.. అవంతి.. రేపు మరోచోట...మరో యువతి... ఇలా ప్రేమను ప్రేమించినందుకు ఈ కిరాతక కుల దురంహకారానికి ఇంకెంతమంది సమిధలు కావాలి. ప్రేమసౌధం తాజ్‌మహల్‌ కొలువైన దేశంలో ప్రేమకు సమాధులు కడుతుంటే చూస్తూ మిన్నకుండి పోవాల్సిందేనా?

హేమంత్ కులదురహంకార హత్యతో జనమంతా ఉలిక్కి పడితే మరోవైపు "డాటర్స్ డే'' సందర్భంగా సోషల్ మీడియా అంతా మారు మోగిపోయింది. గుమ్మాడి..గుమ్మాడి.. అంటూ ఎందరో తండ్రులు తమ కూతుళ్లపై అంతులేని ప్రేమను కురిపించారు. కానీ ఇదంతా చూసిన తరువాత కూడా ఎంతో మంది కూతుళ్ల మనసుల్లో మరిన్ని దిగులు మేఘాలు కమ్మేశాయి. ఎందుకంటే నేరం చేసిన మారుతి రావులాంటి వాళ్లని హీరోలుగా చేసిన ఈ సమాజం, చట్టాలు కలగలిసి మరో తండ్రిని అదే కిరాతకానికి ఉసిగొల్పే ధైర్యాన్నిచ్చింది. అంతేనా ఈ అమానుష కిరాయి హత్యలు ఇప్పటికే ప్రేమలో ఉన్నయువతీయువకుల వెన్నులో వణుకు పుటిస్తున్నాయి. నేను పెళ్లి చేసుకోక పోయినా.. వాడు బతికేవాడు.. నన్ను చంపేసినా బావుండేది అన్న అవంతి మాటలు వారి గుండెల్లో గునపాలవుతున్నాయి.  

చిన్నపుడు అమ్మను నాన్న ఎందుకు కొడుతున్నాడో అర్థంకాదు. ఎందుకు అవమానిస్తున్నాడో తెలియదు. ఇదంతా నా ఖర్మ అంటూ గుడ్లనీరు కుక్కుకున్న అమ్మ బేల ముఖమే చాలామంది అమ్మాయిలకు గుర్తు. ఈ ఘర్షణ నుంచి అవగాహన పెంచుకున్నారు. చదువులు, ఆర్థికస్వావలంబనపై దృష్టిపెట్టి కాలక్రమంలో అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఆకాశంలో సగం అంటూ ధైర్యంగా ముందు కొచ్చారు. అనేక అడ్డంకులు, అవరోధాలు, చివరికి లైంగిక దోపిడీని కూడా ఎదుర్కొంటూ ఆకాశమే హద్దుగా పయనిస్తున్నా యువతులకు పెళ్లి ఒక పెద్ద శాపంగా పరిణమిస్తోంది. కులం, మతం, పరువు పేరుతో హేయమైన దుర్మార్గపు దాడులు, హత్యలు పెను సవాళ్లు విసురు తున్నాయి. ప్రేమిస్తే, పెళ్లి చేసుకుంటే  చావేనా? తమ  పరిస్థితి ఇదేనా, తమకేదీ దిక్కు అనే ఆలోచనలతో ఈ తరం యువతీ యువకులకు కంటిమీద కునుకు లేదంటే అతిశయోక్తి కాదు. కుల, మత మౌఢ్యమనే రక్కసిని అడ్డుకునేదెలా. ఈ మహమ్మారికి మందే లేదా? అనే ప్రశ్నలు వారి మెదళ్ళను తొలిచేస్తున్నాయి.

ప్రేమే నేరమా? 
తమిళనాడులో శంకర్ హత్య ఉదంతం, తెలంగాణాలో  ప్రణయ్, మంథని మధుకర్‌, ఇజ్రాయిల్‌ దారుణ హత్యలు తీవ్ర సంచలనం రేపాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న నవ దంపతులు సందీప్, మాధవిపై అమ్మాయి తండ్రి వేటకొడవలితో దాడికి చేశాడు. అయితే అదృష్టవశాత్తూ ఇద్దరూ ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. అలాగే కులాంతర వివాహం చేసుకున్న కుమార్తెను గర్భిణీ అని కూడా చూడకుండా హత మార్చారు. మరో ఘటనలో బాలింతగా ఉన్న తమ  కూతుర్ని ఏ మాత్రం కనికరం లేకుడా వెంటాడి వెంటాడి చంపి బావిలో పడవేశారు. మరో ఘటనలో కూతురికి మాయ మాటలు చెప్పి నమ్మించి తీసుకొచ్చి ఉరి వేసి హతమార్చారు. ఇలా  చెప్పుకుంటూ పోతే లిస్టు చాలా పెద్దది . అసలు వెలుగులోనివి రానివి, గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతున్నవి బోలెడు.

తమ మాట వినకుండా కులాంతర వివాహం చేసుకుందున్న అక్కసుతో అవంతి భర్త హేమంత్‌ను అత్యంత పాశవికంగా హత్య చేసిన వైనం ఆందోళన రేపింది. ఇదేదో అవేశంతోనో, క్షణికావేశంతోనో చేసింది కాదు. కరోనాతో ప్రపంచమంతా వణికిపోతోంటే అవంతి అమ్మానాన్నలు మాత్రం పగతో రగిలిపోయారు. పన్నాగంతో కుట్రపన్ని, కిరాయి హత్యకు తెగబడ్డారు. ఎప్పటికైనా అమ్మానాన్న మనసు మారుతుందని..తమకూ మంచి రోజులు వస్తాయని, మౌనంగా ఎదురుచూస్తున్న అవంతి ఆశల్ని కాలరాసి ఆమె జీవితంలో అంతులేని అగాధాన్ని మిగిల్చేశారు. మరోవైపు ఏదో ఘనకార్యం చేసినట్లుగా అదే ఊర్లో ఉంటూ, వెడ్డింగ్ షూట్లు, ఫంక్షన్ చేసుకొని మారుతీరావుని రెచ్చ గొట్టిందని, అమృత మీద నోరుపారేసుకున్న దురహంకారులు సోషల్ మీడియోలోమరోసారి తమ నోటికి పని చెబుతున్నారు. తండ్రి ప్రేమ, కట్టుబాట్లు అంటూ సూక్తులు వల్లె వేస్తూ మూర్ఖత్వంతో అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. 

కుటుంబాల్లో తల్లిదండ్రులు, పిల్లల మధ్య ఉండాల్సిన సంబంధాలపై ఇష్టా ఇష్టాలకు తావు లేకుండా ఈ నాటికి మూస ధోరణే కొనసాగుతోంది. అందులోనూ ఆడపిల్లల పరిస్థితి మరీ ఘోరం. మగాడు వాడికేంటి అనే అమానుష ఆధిపత్య ధోరణి. ఆడపిల్లలు ఎలా ఉండాలో...ఏం తినాలో... ఏం బట్టలు కట్టుకోవాలో.. చివరికి ఎవర్ని పెళ్లి చేసుకోవాలో కులాలు, వ్యవస్థలు, కుటుంబాలు, అంతిమంగా తల్లిదండ్రులే శాసిస్తారు. ఆడపిల్లల హక్కులు, వారి వివాహానికి సంబంధించి ఎన్ని చట్టాలు వచ్చినా ఈ ధోరణి మారదు. అదేమంటే కనిపెంచిన తల్లిదండ్రులుగా బిడ్డలపై హక్కు అంటారు. తమ మాట వినకుండా, ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోవడంతోనే కూతురిమీదున్న విపరీతమైన ప్రేమ, కక్షగా మారిందంటూ కిరాయి హత్యలకు వత్తాసు పలుకుతున్న మేధావులు చాలామందే ఉన్నారు.  ఈ విషయంలో సంతానం, మాట వినడాలు, పెత్తనాలపై మనస్తత్వ శాస్త్రవేత్తలు చైల్డ్ సైకాలజిస్టులు చెప్పే శాస్త్రీయ అధ్యయనాల్ని పరిగణనలోకి తీసుకోవాలి. తెల్ల కాగితం లాంటి పసిపిల్లలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే అనేది గుర్తించాలి. మాట వినకుండా.. కొరకరాని కొయ్యల్లాగానో, దుర్మార్గులుగానో, అరాచకంగానో ఎందుకు తయారవుతారనే విషయాన్ని చర్చించుకోవాల్సిన అవసరం ఉంది.  ఎక్కడ లోపం జరుగుతోందో సమీక్షించుకోవాలి. నిజానికి చాలా సమస్యలు అహాల్ని, ఆగ్రహాల్ని పక్కన పెట్టి కాసేపు కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారమయ్యేవే. అలా కాకుండా కులాలు, మతాలు, పరువు, ప్రతిష్టం, వంశం గౌరవం అంటూ పరుగులు పెట్టడంతోనే  సమస్యలు మరింత జఠిలమవుతున్నాయి. షరతులతో కూడిన తల్లిదండ్రుల ప్రేమకు తలొగ్గడానికి ఈనాటి తరం సిద్ధంగా లేదు. వయోజనులైన తరువాత వారికిష్టమైన వారికి పెళ్లి చేసుకునే హక్కు, తమకు నచ్చిన జీవితాన్ని గడిపే హక్కు లాంటి ప్రాథమిక హక్కును రాజ్యాంగమే కల్పించింది. ఈ నేపథ్యంలో పిల్లల ప్రేమల్ని అంగీకరించడం పెద్దల బాధ్యత. ఏదైనా పొరపాటు జరిగితే సరిదిద్దాల్సిన బాద్యత కూడా వారిదే. మేమున్నామనే విశ్వాసాన్ని అందించాలి. అపుడే ప్రజాస్వామిక బంధాలు, అనుబంధాలు వెల్లివిరుస్తాయి.

తల్లిదండ్రులే దోషులా?
ఆడపిల్ల భయంతో భార్య పొట్టనే చీల్చేసిన ప్రబుద్ధులు ఉన్న మన సమాజంలోనే, కూతురు అంటే ప్రాణం పెట్టే తండ్రులూ ఉన్నారు. కానీ బిడ్డల బంగారు భవిష్యత్తుకోసం అహర్నిశలు పాటుపడే తల్లిదండ్రులు వివాహాలదగ్గరికి వచ్చేసరికి పాషాణుల్లా మారిపోతున్నారు. ప్రధానంగా ఇరుగుపొరుగు వారు, రక్తసంబంధీకుల ఒత్తిడి, సూటిపోటీ మాటలను భరించలేమనే భయం వారిని వెంటాడుతుంది. సమాజంలో  వేళ్లూనుకు పోయిన కుల వైరుధ్యాలు, సామాజిక కట్టుబాట్లు హత్యలకు పురిగొల్పుతున్నాయి. మన సమాజంలో ప్రేమ వివాహాలు, కులాంతర వివాహాలు ఇపుడే కొత్తగా పుట్టుకొచ్చినవేమీ కాదు. పురాణాల్లో, ఇతిహాసాల్లో గాంధర్వ వివాహాలే ఇందుకు నిదర్శనం.  


ప్రేమ పెళ్లిళ్లు, కులాంతర వివాహాలు చేసుకుని హాయిగా జీవిస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అయితే ప్రేమ పెళ్ళిళ్లు చేసుకున్నంత మాత్రాన ఆడవాళ్లు జీవితాలు పూర్తిగా మారిపోతాయని, పూర్తి ఆర్ధిక స్వావలంబన, స్వాతంత్ర్యం వచ్చేస్తుందని అనుకోవడం ఉత్త భ్రమ. అక్కడా పురుషాధిపత్య భావజాలం, ఆధిపత్యం కచ్చితంగా ఉంటాయి. ఇదొక సుదీర్ఘ పోరాటం. ఈ పోరాటానికి ప్రేమ బలాన్నిస్తుంది.. శక్తినిస్తుంది...ఆత్మవిశ్వాసాన్నిస్తుంది. ఈ ఘర్షణే పరిష్కారానికి పునాది వేస్తుంది. విద్య, చైతన్యం, అవగాహన ద్వారా సామాజిక అడ్డుగోడలను కూల్చే ప్రయత్నాలు ముమ్మరం కావాలి.. సహజీవనం ఆమోదయోగ్యమని సర్వోన్నత న్యాయస్థానమే తీర్పు చెప్పిన తరువాత కూడా పెళ్లిళ్ల విషయంలో ఆంక్షలు, దాడులు అనాగరికమనే అవగాహన పెరగాలి. వ్యక్తులుగా, పౌర సమూహాలుగా అందరమూ నడుం బిగించాలి. తద్వారా కులరహిత, మత రహిత మానవ సంబంధాలకు పునాది పడాలి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా