ఇక్కడ ఎవరూ ఎవరినీ... బెదిరించలేరు

5 Feb, 2023 04:12 IST|Sakshi

ప్రజలే యజమానులు: రిజిజు

ప్రయాగ్‌రాజ్‌: కొలీజియం విషయంపై కేంద్రానికి, న్యాయవ్యవస్థకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో న్యాయ మంత్రి కిరెణ్‌ రిజిజు మరోసారి స్పందించారు. ప్రయాగ్‌రాజ్‌లో అలహాబాద్‌ హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ 150వ వార్షికోత్సవంలో పాల్గొని రిజిజు ప్రసంగించారు. హైకోర్టు జడ్జీల బదిలీలు, నియామకాల్లో ఏదైనా ఆలస్యమైతే కఠిన నిర్ణయాలు తీసుకుంటామని కేంద్రప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేయడం తెల్సిందే. దీనిపై శనివారం మంత్రి రిజిజు మాట్లాడారు. ‘ భారత్‌లో ప్రజలే అసలైన యజమానులు. మనమంతా సేవకులం.

రాజ్యాంగం చూపిన మార్గనిర్దేశకత్వంలో ప్రజలకు సేవ చేసేందుకే మనం ఇక్కడ ఉన్నాం. ప్రజాభీష్టం మేరకు రాజ్యాంగానికి లోబడే దేశపాలన కొనసాగనుంది. ఇక్కడ ఎవరూ ఎవరినీ బెదిరించలేరు. కొన్ని సార్లు కొన్ని అంశాలపై చర్చలు జరుగుతాయి. ప్రజాస్వామ్యంలో వారి అభిప్రాయం చెప్పే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. బాధ్యతాయుత పదవుల్లో ఆసీనులైన వారు ఏదైనా చెప్పేముందు ఆలోచించాలి’ అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యలనుద్దేశిస్తూ పరోక్షంగా వ్యాఖ్యానించారు. దేశంలోని వేర్వేరు కోర్టుల్లో 4.90 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ‘చిన్న చిన్న కేసులు కోర్టుల బయటే పరిష్కారం పొందుతాయి. దీంతో కోర్టులకు కేసుల భారం చాలా తగ్గుతుంది’ అని మంత్రి అన్నారు. 

మరిన్ని వార్తలు