బార్‌లో పరిచయం, టెక్కీకి శఠగోపం..సిమ్‌ కార్డు దొంగలించి రూ. 8 లక్షలు కొట్టేశాడు

7 Feb, 2023 08:22 IST|Sakshi

సాక్షి, బనశంకరి: గుర్తు తెలియని వ్యక్తిని నమ్మి ఇంట్లో ఆశ్రయమిచ్చిన ఓ టెక్కీ రూ. లక్షల్లో వంచనకు గురయ్యాడు. ఈఘటన బెళ్లందూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగుచూసింది. వివరాలు... సర్జాపురలో నివాసం ఉంటున్న ఆశీశ్‌ ఐటీ ఇంజినీర్‌. గతనె 15న ఇతను బార్‌కు వెళ్లాడు.  ఓ  గుర్తు తెలియని వ్యక్తి కలిశాడు. తన పేరు  తుషార్‌ అలియాస్‌ డిటోసర్కార్‌ అని, ఢిల్లీకి చెందిన వాడినని, బంధువులు ఇంటికి వచ్చినట్లు నమ్మించాడు.  

ఒక్కరోజు తలదాచుకుంటానని..
బంధువులు నగరంలో లేరని, మరో ప్రాంతానికి వెళ్లారని, దీంతో తనకు ఇక్కడ తెలిసిన వారు ఎవరూ లేరని మాటలు కలిపాడు.  ఒకరోజు ఆశ్రయం ఇవ్వాలని తన కష్టం చెప్పుకున్నాడు. అతని మాటలను నమ్మిన ఆశీశ్‌ అమాయకంగా ఫ్లాట్‌కు తీసుకెళ్లాడు. రాత్రి ఫ్లాట్‌లోనే నిద్రించిన తుషార్‌ మరుసటిరోజు ఉదయం అక్కడి నుంచి ఉడాయించాడు. ఆశీశ్‌ ఉదయం నిద్ర లేవగానే తుషార్‌ కనబడకపోగా ఫోన్‌లో సిమ్‌ కార్డు కూడా లేదు.

అదేరోజు మధ్యాహ్నం ఆశీశ్‌ అకౌంట్‌ నుంచి రూ.1.64 లక్షల నగదు వేరే అకౌంట్‌కు జమ అయినట్లు మెసేజ్‌ వచ్చింది. ఇదే తరహాలో అతడి బ్యాంకు అకౌంట్‌ నుంచి దశల వారీగా పదిరోజుల్లో ఆన్‌లైన్‌లో షాపింగ్‌ చేసినట్లు సుమారు రూ.7.20 లక్షలు కట్‌ అయింది. మొత్తం రూ.8.84 లక్షలు పోయింది. తన సిమ్‌ కార్డు దొంగలించిన తుషార్‌ వేరే మొబైల్‌కు అమర్చుకుని అందులో డిజిటల్‌ బ్యాంక్‌ అకౌంట్‌ ద్వారా నగదు జమ చేసుకున్నట్లు తెలిసింది. బాధితుడు బెళ్లందూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు  చేయగా విచారణ చేపట్టారు.  

(చదవండి: వాట్సాప్‌తో ఫుడ్‌ ఆర్డర్‌ చేయొచ్చు)

మరిన్ని వార్తలు