పండుగ వేళ జర భద్రం

24 Oct, 2021 09:28 IST|Sakshi

సాక్షి, చెన్నై(తమిళనాడు): పండుగల సీజన్‌లో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆరోగ్య శాఖ కార్యదర్శి రాధాకృష్ణన్‌ హెచ్చరించారు. రాష్ట్రంలో థర్డ్‌ వేవ్‌కు ఆస్కారం ఉండదు..రాదు...అనే హామీ ఇవ్వలేమని స్పష్టం చేశారు. ఇక, శనివారం రాష్ట్రంలో 50 వేల శిబిరాల్లో  మెగా వ్యాక్సిన్‌ డ్రైవ్‌ పకడ్బందీగా నిర్వహించారు. కరోనా నియంత్రణ లక్ష్యంగా రాష్ట్రంలో ప్రతి ఆదివారం మెగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పటి వరకు ఐదు విడుదలు ఈ శిబిరాలు విజయవంతం అయ్యాయి. నాలుగున్నర కోట్ల మందికి పైగా వ్యాక్సిన్‌ వేసుకున్నారు. మరో కోటి మంది తొలి డోస్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవాల్సి ఉంది. అయితే, ఆదివారం శిబిరాల ఏర్పాటు కారణంగా మందుబాబులు, మాంసం ప్రియులు టీకా వేసుకునేందుకు ముందుకు రావడం లేదన్న విషయం పరిశీలనలో తేలింది. దీంతో  ఈసారి మెగా శిబిరం శనివారానికి మార్చారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రపథమంగా 50 వేల శిబిరాల్ని ఏర్పాటు చేశారు 60 లక్షల మేరకు డోస్‌ల టీకాను సిద్ధంగా ఉంచారు. అయితే, ఆశించిన మేరకు ఈసారి ఈ డ్రైవ్‌కు స్పందన రాలేదు. 15 లక్షల మంది మేరకు టీకా వేయించుకున్నారు.  

సీఎం పరిశీలన, సమీక్ష 
కన్నగి నగర్‌లో ఏర్పాటు చేసిన వ్యాక్సిన్‌ శిబిరాన్ని సీఎం ఎంకే స్టాలిన్‌ పరిశీలించారు. ప్రజలతో మాట్లాడా రు. వారి సమస్యల్ని తెలుసుకున్నారు. అలాగే, అక్కడ వెళ్తున్న నగర రవాణా సంస్థ బస్సుల్లో ఆకస్మికంగా ఎక్కి.. మహిళా  ప్రయాణికులతో మాట్లాడారు. ఉచిత బస్సు సేవల గురించి అభిప్రాయాలు తీసుకున్నారు. ఈసందర్భంగా పలువురు మహిళలు కొన్ని సమస్యలు, సూచనలు ఇచ్చారు. అనంతరం సచివాలయానికి చేరుకున్న సీఎం స్టాలిన్‌ అధికారులతో సమావేశం అయ్యారు. పండుగ సీజన్‌ వేళ కరోనా ఆంక్షల సడలింపు, ఈనెల 31తో ముగియనున్న ఆంక్షలు, కొనసాగింపు గురించి సమీక్షించారు. అంగన్‌వాడీలు, నర్సరీ పాఠశాలలు నవంబర్‌ 1వ తేదీ నుంచి తెరవాలనే విషయాన్ని వాయిదా వేసినట్లు వెల్లడించారు. 

 షిఫ్ట్‌ల వారీగా తరగతులు  
ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి విద్యార్థులకు నవంబర్‌ 1వ తేదీ నుంచి షిఫ్టుల వారీగా తరగతులు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం శనివారం ప్రకటించింది. కరోనా ఆంక్షలను నవంబర్‌ 15వ తేది వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. క్రీడల, స్విమ్మింగ్‌ తదితర పోటీల నిర్వహణకు, థియేటర్లలో 100 శాతం ప్రేక్షకులకు అనుమతి కల్పించారు. అయితే, రాజకీయ కార్యక్రమాలు, ఆలయ ఉత్సావలకు గతంలో విధించిన ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.

ఇక చెన్నైలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ప్రారంభించినానంతరం ఆరోగ్య కార్యదర్శి రాధాకృష్ణన్‌ మీడియాతో మాట్లాడుతూ, పండుగ సీజన్‌లో జనం మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. పలు దేశాల్లో థర్డ్‌ వేవ్‌ విజృంభిస్తున్నదని గుర్తు చేశారు. ప్రస్తుతం పండుగ సీజన్‌ ఆందోళన కల్గిస్తోందని, టీకా వేసుకోని వాళ్లు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని విన్నవించారు.

ఇంకా కోటి మందికి తొలి డోస్‌ వేసుకోవాల్సి ఉందని, మరో 57 లక్షల మంది రెండో డోస్‌ వేసుకోవాల్సి ఉందని వివరించారు. వీరంతా టీకా వేయించుకోకుండా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అరియలూరులో ఏర్పాటు చేసిన శిబిరాన్ని ప్రారంభించినానంతరం మీడియాతో ఆరోగ్య మంత్రి సుబ్రమణియన్‌మాట్లాడుతూ, విద్యార్థులకు చదువులు కుంటు పడకుండా ఉండేందుకే.. పాఠశాలల్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.  

చదవండి: Match Box: 14 ఏళ్ల తరువాత దాని ధర డబుల్‌ ..

మరిన్ని వార్తలు