Covid Third Wave In India: వేల సంఖ్యలో కేసులు.. భారత్‌లో మొదలైన కరోనా థర్డ్‌వేవ్‌?

4 Jan, 2022 19:55 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్‌ మహమ్మారి మరోసారి గుబులు పుట్టిస్తోంది. రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ప్రధాన నగరాల్లో విచ్ఛలవిడిగా ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోంది. గతవారం రోజుల్లో కేసుల్లో భారీ పెరుగుదల.. దేశంలో థర్డ్ వేవ్‌ను సూచిస్తోందని కోవిడ్ టాస్క్‌ఫోర్స్‌ ఛైర్మన్ డాక్టర్ ఎన్‌కే అరోరా పేర్కొన్నారు. అయితే, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని తెలిపారు.

అది మాత్రం మరువొద్దు
దక్షిణాఫ్రికా తరహాలోనే భారత్‌లో మూడోవేవ్ ఉద్ధృతి ఉండవచ్చని డాక్టర్ అరోరా అంచనా వేశారు. గత పదిరోజుల్లో ఇన్ఫెక్షన్ ప్రవర్తనను చూస్తుంటే త్వరలోనే మూడో ముప్పు గరిష్ఠానికి చేరుకుంటుందని భావిస్తున్నామన్నారు. సౌతాఫ్రికాలో రెండు వారాలకే కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిన విషయాన్ని డాక్టర్ అరోరా ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయితే, వ్యాధి తీవ్రత, ఆస్పత్రి బారినపడకుండా రక్షణ పొందాలంటే రెండు డోసుల వ్యాక్సినేషన్‌ తీసుకోవాలని ఆయన స్పష్టంచేశారు. వీటితోపాటు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
(చదవండి: కేంద్రమంత్రి మహేంద్ర నాథ్ పాండేకు కరోనా)

రెండు వారాల్లోనే భారీ విస్తరణ
డిసెంబర్‌ తొలివారంలో దేశంలో ఒమిక్రాన్ తొలి కేసును గుర్తించగా.. రెండు వారాల్లోనే 23రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త వేరియంట్‌ విస్తరించింది. ఇప్పటివరకు 1892 కేసులు వెలుగుచూశాయి. అత్యధికంగా మహారాష్ట్రలో 568 కేసులు రికార్డ్‌ అవ్వగా.. ఢిల్లీలో 382, కేరళలో 185, రాజస్థాన్‌లో 174, గుజరాత్ 152, తమిళనాడు 121 కేసులు నమోదయ్యాయి. ఇక గడిచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 37,379 కరోనా కేసులు నమోదుకాగా.. యాక్టివ్ కేసుల సంఖ్య లక్షా 72వేలకు పెరిగినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం నాటి బులెటిన్‌లో పేర్కొంది.
(చదవండి: ఒమిక్రాన్‌ సాధారణ జ్వరం మాత్రమే: యోగి )

మరిన్ని వార్తలు