రైతుల ‘మహాపంచాయత్‌’

23 Aug, 2022 06:15 IST|Sakshi
నిరసనలో పాల్గొన్న రైతులు

ఢిల్లీకి తరలివచ్చిన వేలాదిమంది అన్నదాతలు  

ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చాలని ఆందోళన  

న్యూఢిల్లీ: పంటలకు కనీస మద్దతు ధరకు(ఎంఎస్పీ) చట్టబద్ధత, వ్యవసాయ రుణాల మాఫీ, విద్యుత్‌ (సవరణ) చట్టం–2022 రద్దుతోపాటు ఇతర డిమాండ్ల సాధనే ధ్యేయంగా మహాపంచాయత్‌లో పాల్గొనేందుకు రైతు సంఘాల పిలుపు మేరకు వేలాది మంది రైతులు ఢిల్లీకి తరలివచ్చారు. సోమవారం జంతర్‌మంతర్‌ వద్దకు చేరుకున్నారు. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, కేరళ తదితర రాష్ట్రాల నుంచి రైతన్నలు తరలివచ్చారు.

నగరంలో ఎక్కువ రోజులు ఉండేందుకే వారు సిద్ధపడి వచ్చినట్లు తెలుస్తోంది. తమ వెంట సంచులు, దుస్తులు తెచ్చుకున్నారు. రైతు సంఘాల నేతలు ఇచ్చిన జెండాలను చేతబూనారు. టోపీలు ధరించారు. జన్‌పథ్‌ మార్గంలోనూ తిరుగుతూ కనిపించారు. అన్నదాతల ఐక్యత వర్థిల్లాలని నినాదాలు చేశారు. హామీలను నెరవేర్చడం లేదంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. జంతర్‌మంతర్‌కు చేరుకోకుండా రైతులను పోలీసులు అడ్డుకుంటున్నారని సంయుక్త కిసాన్‌ మోర్చా(ఎస్‌కేఎం) నేతలు ఆరోపించారు.

పోలీసులు మాత్రం ఖండించారు. మహాపంచాయత్‌ సందర్భంగా దేశ రాజధానిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. తాము ఎవరినీ అడ్డుకోవడం లేదని చెప్పారు. డిమాండ్లు నెరవేరేదాకా తమ పోరాటం ఆగదని, అందుకోసం పూర్తిస్థాయి సిద్ధమై ఢిల్లీకి చేరుకున్నానని పంజాబ్‌ రైతు మాఘా నిబోరీ చెప్పారు. ప్రముఖ రైతు సంఘం నేత రాకేశ్‌ తికాయత్‌ ఢిల్లీలోకి ప్రవేశించకుండా ఆదివారమే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  

ఢిల్లీలో భారీగా ట్రాఫిక్‌ జామ్‌  
రైతుల మహాపంచాయత్‌ సందర్భంగా ఢిలీలో భారీగా ట్రాఫిక్‌ స్తంభించింది. పోలీసులు పలు మార్గాల్లో రాకపోకలపై ఆంక్షలు విధించారు. వాహనాలకు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఢిల్లీ బోర్డర్‌ పాయింట్ల వద్ద 2020 నవంబర్‌ నాటి దృశ్యాలే మళ్లీ కనిపించాయి. ఘాజీపూర్, సింఘూ, తిక్రీ తదితర బోర్డర్‌ పాయింట్ల వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. వాహనాలను క్షుణ్నంగా తనిఖీ చేసిన తర్వాతే నగరంలోకి అనుమతించారు. సరిహద్దుల్లో వాహనాలు గంటల తరబడి బారులు తీరాయి.  

మరిన్ని వార్తలు