BKU: ఢిల్లీ సరిహద్దులకు చేరుతున్న రైతులు

25 May, 2021 08:17 IST|Sakshi

చండీగఢ్‌: ఈ నెల 26న రైతులు తలపెట్టిన బ్లాక్‌డే నిరసన సందర్భంగా పంజాబ్‌ నుంచి పెద్ద ఎత్తున రైతులు ఢిల్లీ సరిహద్దులకు చేరుకుంటున్నారు. కేంద్రం తీసుకొచ్చిన సాగుచట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసనలు ఆరు నెలలకు చేరిన సందర్భంగా రైతు సంఘాలు ఈ నెల 26న దేశవ్యాప్త నిరసనలు చేపట్టనున్నారు. దీనికి హాజరు కావాల్సిందిగా రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు పంజాబ్‌ నుంచి భారీ స్థాయిలో రైతులు ఢిల్లీ సరిహద్దులకు వస్తున్నారని భారతీ కిసాన్‌ యూనియన్‌ (ఏక్తా ఉగ్రాహణ్‌) సీనియర్‌ నేత షింగారా సింగ్‌ సోమవారం చెప్పారు.

యువకులు, పెద్దలు అంతా కలసి తమ వాహనాలతో తిక్రి, సింఘు సరిహద్దులకు చేరుకుంటున్నారు. పంజాబ్‌లోని సంగ్రూర్, పాటియాలా, మనసా, బతిందా, మోగ, గుర్దాస్‌పుర్, ఫరిద్‌కోట్‌ జిల్లాల నంచి రైతులు వస్తున్నట్లు షింగారా తెలిపారు. రైతులు చేపట్టనున్న నిరసనకు కాంగ్రెస్‌ నేత నవ్‌జోత్‌  సింగ్‌ సిద్దు మద్దతు ప్రకటించారు. నిరసన రోజున వారికి సంఘీభావంగా తన ఇంటిపై నల్లజెండా ఎగురవేస్తానని చెప్పారు.

(చదవండి: CM Chauhan: జనాలు చస్తుంటే..రాజకీయాలా!)

మరిన్ని వార్తలు