బిచ్చగాడి అంతిమయాత్రకు ఊరూ-వాడా కదిలింది!

18 Nov, 2021 13:04 IST|Sakshi

Karnataka Beggar Death: అంతిమ సంస్కారం.. ఇది జీవితంలో చివరి ఘట్టం.  ముఖ్యమైన ఘట్టం. మన పుట్టుక ఎలా ఉంది.. మధ్యలో ఎలా బ్రతికాం అన్నది కాదు.. చివరి శ్వాస వదిలేసినప్పుడే ఆ మనిషి విలువ తెలుస్తుంది. ఇక్కడ ధనిక, బీదా అనే తేడా ఉండదు. ధనం ఉన్నవారికి కాస్త గ్రాండ్‌ అంతిమ వీడ్కోలు పలికితే, బీద వారు వారు స్థాయికి తగ్గట్టే ఆ తుది ఘట్టాన్ని పూర్తి చేస్తారు. మరి ఎటుకాని బిచ్చగాళ్లు మరణిస్తే వారిని మున్సిపల్‌ సిబ్బందే తమ వాహనంలో తరలించి అంత్యక్రియలు నిర్వహిస్తారు. ఫలానా బిచ్చగాడు చనిపోయాడంటే సాధారణంగా జనం కూడా పెద్దగా పట్టించుకోరు.  కానీ ఒక యాచికుడ్ని ఊరంతా సొంతం చేసుకుంది. అతని అంతిమయాత్రలో అడుగులో అడుగై నడిచింది. అతని అమాయకపు నవ్వును గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకుంది. అతన్ని గుండెల్లో పెట్టుకుని ఘనంగా వీడ్కోలు పలికింది. 

వివరాల్లోకి వెళితే.. క‌ర్ణాట‌క‌లోని విజ‌య‌న‌గ‌ర జిల్లాలోని హ‌విన‌హ‌డ‌గ‌లిలో హుచ్చ‌బ‌స్య‌ అనే యాచ‌కుడు మ‌ర‌ణించాడు.  అతని మృతిని తెలుసుకున్న హవినహడగలి జనం శోక సంద్రంలో మునిగిపోయారు. అంతేకాదు అతని అంతిమయాత్రను ఎంతో ఘనంగా చేయాలని నిర్ణయించుకుని పెద్ద ఎత్తున ఊరేగింపుగా అంతిమ యాత్ర చేశారు. ఈ అంతిమ సంస్కారంలో ప్రజలు తమకు తాముగా స్వచ్ఛందంగా పాల్గొనడం విశేషం. 

హుచ్చ‌బ‌స్య‌ ప‌ట్ట‌ణంలో ఎన్నో ఏళ్లుగా నివ‌శిస్తున్నాడు.  దివ్యాంగుడైన అతను ప‌ట్ట‌ణంలో ప్ర‌తి ఒక్క‌రికి హుచ్చ‌బ‌స్య‌  గురించి బాగా సుపరిచితుడు.  అంద‌ర్ని ప‌ల‌క‌ల‌రిస్తూ కేవలం రూపాయి మాత్ర‌మే యాచించి తీసుకునేవాడు.  అంత‌కంటే ఎక్కువ ఇస్తే తీసుకునేవాడు కాదు. అదేంటో సాధారణంగా ఎవరైనా బిచ్చగాడు కనిపిస్తే అసహ్యించుకునే సందర్భాలే ఎక్కువ కానీ హచ్చబస్యకు రూపాయి ధ‌ర్మం చేయ‌డం వ‌ల‌న మంచి జరుగుతుందని అక్కడి ప్రజల భావన.. అందుకే హ‌చ్చ‌బ‌స్య క‌నిపిస్తే రూపాయి ఇచ్చేసేవారు అక్క‌డి ప్ర‌జ‌లు.  

ఇక ఆలయాల్లో లేదా స్కూళ్లలో త‌ల‌దాచుకునేవాడు.  అయితే, ఇటీవల అతను రోడ్డు ప్ర‌మాదానికి గురికావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మ‌ర‌ణించాడు. దాంతో స్థానిక ప్రజలు కన్నీరు పెట్టుకున్నారు. ఎమ్మెల్యేలు, ప్ర‌జాప్ర‌తినిధులు ఎవ‌రు క‌నిపించినా పేరుపెట్టి పిలిచి రూపాయి ధ‌ర్మం అడిగి తీసుకునేవాడ‌ట హ‌చ్చ‌బ‌స్య‌.  ఆయ‌న్ను అక్క‌డ అంతా అదృష్ట బ‌స్య అని పిలుచుకునేవారు. ఒక బిచ్చగాడు మరణంలో అశేషమైన జనాన్ని సంపాదించుకోవడం చర్చనీయాంశమైంది. 

మరిన్ని వార్తలు