యాడ్‌ దుమారం : తనిష్క్‌ స్టోర్‌కు బెదిరింపులు

14 Oct, 2020 14:48 IST|Sakshi

క్షమాపణ నోట్‌ విడుదల

అహ్మదాబాద్‌ : ప్రముఖ జ్యూవెలరీ బ్రాండ్‌ తనిష్క్‌ వివాదాస్పద యాడ్‌ కలకలం రేపుతోంది. ఈ యాడ్‌ లవ్‌ జిహాదీని ప్రోత్సహిస్తోందని పలువురు నెటిజన్లు సోషల్‌ మీడియాలో దుమ్మెత్తిపోయడంతో యాజమాన్యం దిగివచ్చి యూట్యూబ్‌ నుంచి ఈ యాడ్‌ను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. వివాదస్పద యాడ్‌పై గుజరాత్‌లోని కచ్‌ జిల్లాలో తనిష్క్‌ స్టోర్‌కు బెదిరింపులు వచ్చాయి. ఈ ప్రకటన సరైంది కాదని తమ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూ ఈ స్టోర్‌కు కొందరు బెదిరింపు కాల్స్‌ చేశారని పోలీసులు తెలిపారు.

స్టోర్‌ వద్ద ఎలాంటి ఆందోళనలు, ఘర్షణలు చోటుచేసుకోలేదని ఈ ప్రాంతంలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశామని పోలీసు అధికారులు పేర్కొన్నారు. సోమవారం రాత్రి తనిష్క్‌ గాంధీధామ్‌ స్టోర్‌ వద్దకు నిరసనకారులు రాగా, స్టోర్‌ యాజమాన్యం క్షమాపణలు చెబుతూ నోట్‌ రాసినట్టు సమాచారం. ఈ యాడ్‌ సిగ్గుచేటని, దీనికి తమను మన్నించాలంటూ స్టోర్‌ మేనేజర్‌ రాసిన క్షమాపణ నోట్‌ను ఆందోళనకారులు స్టోర్‌పై అతికించారు. గత వారం తనిష్క్‌ విడుదల చేసిన యాడ్‌పై సోషల్‌ మీడియాలో ఓ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైన సంగతి తెలిసిందే.

కాగా, ముస్లిం కుటుంబంలో అడుగుపెట్టిన హిందూ కోడలి సీమంతం థీమ్‌తో రూపొందించిన ఈ ప్రకటన, లవ్‌ జీహాదీని ప్రోత్సహించేవిధంగా ఉందంటూ నెటిజన్లు  #BoycottTanishq ట్రెండ్‌ చేయడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇకపై తనిష్క్‌ ఆభరణాలు కొనే ప్రసక్తే లేదని, టాటా గ్రూప్‌నకు సంబంధించిన అన్ని ఉత్పత్తులపై దీని ప్రభావం ఉంటుందంటూ ట్రోల్‌ చేసిన నేపథ్యంలో తమ ఉద్యోగులు, భాగస్వాముల శ్రేయస్సు కోరి యాడ్‌ను డిలీట్‌ చేసినట్లు సంస్థ వెల్లడించింది. చదవండి : అందుకే ఆ యాడ్‌ తొలగించాం: తనిష్క్‌

మరిన్ని వార్తలు