-

ఐసిస్‌–కెతో భారత్‌కూ ముప్పు!

28 Aug, 2021 04:46 IST|Sakshi

న్యూఢిల్లీ: మధ్య, దక్షిణాసియాల్లో జీహాద్‌ లక్ష్యంగా ఏర్పాటైన ఉగ్రవాద సంస్థ ఐసిస్‌–కె భారత్‌పైనా దృష్టి సారించినట్టుగా ఇంటెలిజెన్స్‌కు సమాచారం అందింది. మధ్య ఆసియా దేశాల తర్వాత భారత్‌నే లక్ష్యంగా చేసుకోనున్నట్టు ప్రభుత్వ వర్గాలు శుక్రవారం వెల్లడించాయి. భారత్‌లో దాడులు చేయడం, యువతపై గాలం వేసి తమ సంస్థలోకి లాగడం వారి ముందున్న లక్ష్యమని, భారత్‌లో ముస్లిం పాలన తీసుకురావాలన్న ఎజెండాతో వారు పని చేస్తున్నట్టుగా తమకు సమాచారం ఉందని ప్రభుత్వ అధికారి తెలిపారు. కేరళ, ముంబైకి చెందిన ఎందరో యువకులు ఇప్పటికే ఈ సంస్థలో చేరారని చెప్పారు. ఈ ఉగ్రవాద సంస్థ క్రమంగా బలం పెంచుకుంటూ పోతే భారత్‌లో ఎన్నో స్లీపర్‌ సెల్స్‌ చురుగ్గా మారే అవకాశం ఉందని ఆ అధికారి ఆందోళన వ్యక్తం చేశారు. అఫ్గాన్‌ను తాలిబన్లు కైవశం చేసుకున్న తర్వాత ఉగ్రవాద సంస్థల గురి భారత్‌పైనే ఉందని అన్నారు.  

కేరళ టు కాబూల్‌ టు కశ్మీర్‌
అది 2016 సంవత్సరం, జూలై 10. కేరళలోని కాసర్‌గోడ్‌కు చెందిన ఓ వ్యక్తి తన 30 ఏళ్ల కుమారుడు అబ్దుల్‌ రషీద్, ఆయన భార్య అయేషా (సోనియా సెబాస్టియన్‌) ముంబైకి వెళ్లిన దగ్గర్నుంచి కనిపించకుండా పోయారని పోలీసులకు ఫిర్యాదు చేశారు.  అప్పుడు పోలీసులు తీగ లాగితే ఐసిస్‌–కె డొంక కదిలింది. వారు దేశాన్ని వీడి ఉగ్ర సంస్థలో చేరడానికి కాబూల్‌ వెళ్లారని తేలింది. కేరళ నుంచి కాబూల్‌కి వెళ్లిన వారు తిరిగి కశ్మీర్‌కు వచ్చి దాడులకు పన్నాగాలు పన్నారు. అప్పట్నుంచి ఈ సంస్థపై భారత్‌ ఇంటెలిజెన్స్‌ నిఘా పెట్టింది. ఇక కాబూల్‌లోని గురుద్వారాపై 2020 మార్చి 25న జరిగిన దాడిలో కూడా ఐసిస్‌–కెలోని భారతీయుల ప్రమేయం ఉన్నట్టు తేలింది.

మరిన్ని వార్తలు