బీజేపీకి టచ్‌లో టీఎంసీ ఎమ్మెల్యేలు! డిసెంబర్‌లో దీదీ సర్కార్‌ కూలిపోవడం పక్కా అంటూ..

22 Nov, 2022 15:47 IST|Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ పతనానికి రోజులు దగ్గర పడ్డాయని బీజేపీ పదే పదే చెబుతూ వస్తోంది. ఈ క్రమంలో డిసెంబర్‌లో ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమంటూ కమలం కీలక నేతలంతా ప్రకటనలు ఇస్తూ వస్తున్నారు. తాజాగా.. బీజేపీ ఎమ్మెల్యే అగ్నిమిత్రా పాల్ సైతం ఇదే కామెంట్‌ చేశారు‌. ఈ మేరకు మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘డిసెంబర్‌లో ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమ’ని ప్రకటించారు. 

‘‘టీఎంసీ నుంచి 30 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి టచ్‌లో ఉన్నారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉనికి ప్రమాదంలో పడింది అంటూ వ్యాఖ్యానించారామె. అంతేకాదు.. రాబోయే రోజుల్లో బెంగాల్‌లో పెద్ద ఆట చూడబోతున్నారంటూ మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యానించారామె. 

‘‘వ్యూహమేంటో మేం చెప్పం. కానీ, ఏదో జరగబోతోంది. డిసెంబర్‌లో పెద్ద ఆట ఉండనుందని మా నాయకత్వం పదే పదే చెబుతోంది. రాష్ట్రం ఆర్థిక ఎమర్జెన్సీ దిశగా పయనిస్తోంది. ఇది(టీఎంసీని ఉద్దేశించి..) దివాలా తీసిన ప్రభుత్వం. వాళ్ల(ప్రభుత్వం) వద్ద డబ్బు లేదు. ఖాళీ ఖజానాతో ఎలా పని చేస్తారు? రాష్ట్రాన్ని పాలిస్తున్న వాళ్లలో 50 శాతం మంది జైలుల్లోనే ఉన్నారు. మిగిలిన 50 శాతం మంది కూడా జైలుకు వెళ్తారు. మరి ప్రభుత్వాన్ని నడిపించేది ఎవరు?.. అంటూ వ్యాఖ్యానించారామె. 

ఇదిలా ఉంటే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంతా మజుందార్‌ ఏకంగా 40 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని, మమతా బెనర్జీ సైతం జైలుకు వెళ్తారంటూ ఓ ప్రకటన ఇచ్చారు. అంతేకాదు డిసెంబర్‌ బెంగాల్‌ ప్రభుత్వం కుప్పకూలడం ఖాయమంటూ వ్యాఖ్యానించారు. మరోవైపు బీజేపీ నేత, నటుడు మిథున్‌ చక్రవర్తి కూడా టీఎంసీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ కామెంట్‌ చేశారు. వ్యక్తిగతంగా తనకే 21 మంది ఫోన్‌ ద్వారా టచ్‌లో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఇక ప్రతిపక్ష నేత సువేందు అధికారి సైతం టీఎంసీ ఎమ్మెల్యేలు కాంటాక్ట్‌లో ఉన్నారని చెబుతూ.. డిసెంబర్‌లో దీదీ సర్కార్‌ కూలిపోవడం ఖాయమంటూ ప్రకటించారు. అవినీతిలో కూరుకుపోయిన నేతలను చూసి.. మరికొందరిలో భయం నెలకొందని, వాళ్లు పార్టీ మారేందుకు ఆస్కారం ఉందని చెప్పారు సువేందు.

అయితే బెంగాల్‌ అసెంబ్లీ సంఖ్యా బలం చూసుకుంటే.. టీఎంసీ ఫుల్‌ మెజార్టీతో ఉంది. మరోవైపు బెంగాల్‌ పంచాయితీ ఎన్నికల వేళ.. ఎలాగైనా భారీ విజయం సాధించాలని బీజేపీ పరితపిస్తోంది. స్టార్‌ క్యాంపెయినర్‌ మిథున్‌ చక్రవర్తిని రంగంలోకి దించిన బీజేపీ.. ఇప్పటికే టీఎంసీ పట్టున్న ప్రాంతాల్లో సభలు, సమావేశాలు నిర్వహించే యత్నం చేస్తోంది.

ఇదీ చదవండి: రామారావు పార్టీ మారితే నేను మారతానా? 

మరిన్ని వార్తలు