అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారులకు మరణ శాసనం

11 Oct, 2020 08:35 IST|Sakshi
ఘటనాస్థలి వద్ద గుమిగూడిన జనం

భారీ వర్షాలకు నిండిన రైల్వే అండర్‌ పాస్‌

నీటి తరలింపు కోసం తవ్విన కాలువలో పడి ముగ్గురు 

చిన్నారుల మృతి

బంగారుపేటలో విషాదం 

కేజీఎఫ్(కర్ణాటక)‌: అధికారుల నిర్లక్ష్యం చిన్నారులకు మరణశాసనమైంది. ముగ్గురు తల్లులకు కడుపుకోత మిగిల్చింది. రైల్వే అండర్‌పాస్‌లో నిలిచిన నీటిని తరలించేందుకు అధికారులు తవ్వించిన కాలువలోకి దిగిన చిన్నారులు పైకి రాలేక మృత్యువాత పడ్డారు. ఈ విషాద ఘటన బంగారుపేటలో శనివారం చోటు చేసుకుంది. మృతులను కుంబారహళి్లకి చెందిన సయ్యద్‌ అమీర్‌ కుమారుడు సాధిక్‌ (12), సలీం కుమార్తె మెహిక్‌ (8), నవీద్‌ కుమారుడు ఫయాజ్‌(7)గా గుర్తించారు. శుక్రవారం బంగారుపేట పట్టణంలో భారీ వర్షం కురిసింది. దీంతో పట్టణంలో అశాస్త్రీయంగా నిర్మించిన రైల్వే అండర్‌ పాస్‌ పొంగి పొర్లింది. వాహనరాకపోకలు స్తంభించడంతో రైల్వే అధికారులు జేసీబీ సహాయంతో సమాంతరంగా కాలువ తవ్వించి నీటిని మళ్లించారు.

శనివారం మధ్యాహ్నం అటుగా వచ్చిన ముగ్గురు చిన్నారులు  సరదాగా కాలువలోకి దిగారు. నీరు లోతుగా ఉండడంటంతో పైకి వచ్చేందుకు యత్నించగా జారి మళ్లీ నీటిలోకి పడిపోయి ప్రాణాలు కోల్పోయారు. పట్టణ పోలీసులు వచ్చి మృతదేహాలను వెలికి తీశారు. ప్రాణానికి ప్రాణమైన తమ పిల్లలు ఇక లేరని తెలుసుకున్న తల్లిదండ్రులు ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాలపై రోదించారు. చిన్నారుల మృతదేహాలకు పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. కాగా అండర్‌పాస్‌ అశాస్త్రీయంగా నిర్మించిన అండర్‌పాస్‌ వల్ల ఘోరాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు దుమ్మెత్తి పోశారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం అందించాలని రైతు సంఘం డిమాండ్‌ చేసింది.  

మరిన్ని వార్తలు