బీజేపీ రికార్డు విజయం వెనక.. ముచ్చటగా మూడు కారణాలు 

9 Dec, 2022 07:01 IST|Sakshi

దేశంలోని మిగతా అన్ని రాష్ట్రాల మాదిరిగానే గుజరాత్‌లో కూడా సామాన్యుల్లో చాలా అంశాలపై తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. ధరల పెరుగుదల మొదలుకుని నానా రకాల సమస్యలతో వాళ్లు కూడా సతమతమవుతూనే ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి వెన్నెముకగా భావించే పాడి పరిశ్రమపై ఆధారపడ్డ అసంఖ్యాకులు ద్రవ్యోల్బణం దెబ్బకు లాభాలు సన్నగిల్లి అల్లాడుతున్నారు. వారంతా దీన్ని రాష్ట్ర బీజేపీ ప్రభుత్వ వైఫల్యంగానే చూశారు.

సంపన్న సూరత్‌ వస్త్ర వ్యాపారుల నుంచి మధ్య గుజరాత్‌లోని నిరుపేద పొగాకు రైతుల దాకా అందరిదీ ఇదే వ్యథ, ఇదే అభిప్రాయం. అయినా సరే, బీజేపీకి ఓటేయడం మినహా మరో మార్గం లేదన్న భావన వారిలో ప్రబలంగా వ్యక్తమవడం విశేషం! 27 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉన్నా ప్రభుత్వ వ్యతిరేకత కనిపించకపోవడం మరో విశేషం. ఇందుకు మూడు కారణాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి. హిందూత్వ నినాదం, ప్రధాని మోదీ మేజిక్, విపక్ష ఓటులో చీలిక. ఈ మూడూ కలగలిసి బీజేపీకి కళ్లుచెదిరే విజయం కట్టబెట్టాయి. 

హిందూత్వ నినాదం 
హిందూత్వ రాజకీయాలు గుజరాత్‌లో చిరకాలంగా లోలోతులకు పాతుకుపోయాయి. నిజానికి ఎన్నికల ప్రచార సమయంలో కూడా రాష్ట్రంలో సన్నకారు పాడి రైతు మొదలుకుని పాటిదార్‌ పత్తి రైతు దాకా ఎవరిని కదిలించినా ద్రవ్యోల్బణం దెబ్బకు రెండు మూడేళ్లలో ఆర్థికంగా అక్షరాలా చితికిపోయామంటూ వాపోయినవాళ్లే. కానీ ఓటు మాత్రం బీజేపీకి వేయడం తప్ప ప్రత్యామ్నాయం లేదన్నది వారంతా ఏకగ్రీవంగా చెప్పిన మాట!

ముస్లింల ప్రాబల్యాన్ని అడ్డుకోవాలంటే మరో మార్గం లేదన్నది వారు వెలిబుచ్చిన అభిప్రాయం. ‘‘గతంలో అహ్మదాబాద్‌ వెళ్లాలంటే ‘గొడవ’లేమన్నా అవుతున్నాయా అని ముందుగా వాకబు చేయాల్సొచ్చేది. కానీ సాహెబ్‌ (మోదీ) వచ్చాక అల్లర్లూ లేవు, సమస్యలూ లేవు’’ అని సగటు హిందూ ఓటర్లంతా చెప్పుకొచ్చారు. ఈ ముస్లిం వ్యతిరేక భావజాలం వారిలో ఇప్పటికీ ప్రబలంగా ఉంది. మతపరమైన విభజన ఆర్థిక కష్టాలను కూడా వెనక్కు నెట్టేసేంది. ఇదే బీజేపీకి శ్రీరామరక్షగా మారింది. 

మోదీ మేనియా 
సీఎంగా 13 ఏళ్లు గుజరాత్‌లోనూ, పీఎంగా ఎనిమిదేళ్లుగా కేంద్రంలోనూ తిరుగులేని నాయకునిగా మోదీ సాధించిన పేరు ప్రఖ్యాతులు కూడా ఈసారి ఫలితాలను బాగా ప్రభావితం చేశాయి. ముఖ్యంగా తటస్థ, ఎటూ నిర్ణయించుకోలేని ఓటర్లు మోదీ కరిష్మా కారణంగా బీజేపీవైపే మొగ్గినట్టు ఫలితాల సరళి స్పష్టంగా చెబుతోంది. నిజానికి అధికార బీజేపీ ఎమ్మెల్యేల అసమర్థత, అధికారుల్లో విచ్చలవిడిగా పెరిగిపోయిన అవినీతిని రాష్ట్రంలో జనం అసహ్యించుకునే పరిస్థితి ఉంది! కానీ మోదీ మేనియా వీటన్నింటినీ చాలావరకు అధిగమించేసింది. 

విపక్ష ఓటులో చీలిక 
గుజరాత్‌లో ఎప్పుడు బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య సాగుతూ వచ్చిన పోరు కాస్తా ఆప్‌ అన్ని అస్త్రశ్రస్తాలతో రంగంలోకి దిగడంతో ముక్కోణ పోరుగా మారిపోయింది. కేజ్రీవాల్‌ పార్టీ ప్రధానంగా చీల్చింది బీజేపీ వ్యతిరేక ఓటునే! అంటే కాంగ్రెస్‌ పార్టీ ఓటు బ్యాంకునే!! అంతిమంగా ఇది ప్రధాన ప్రతిపక్షానికి కోలుకోలేని దెబ్బగా, బీజేపీకి అనుకోని వరంగా పరిణమించింది. ఈ కారణంగానే కమలం పార్టీ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా రికార్డు స్థాయిలో 150 సీట్ల మార్కును దాటగలిగింది.

ఏకంగా 53 శాతం ఓట్లు కొల్లగొట్టింది. మరోవైపు కాంగ్రెస్‌ ఓటు బ్యాంకు 41 శాతం నుంచి 27 శాతానికి పడిపోయింది. ఆప్‌ సాధించిన 13 శాతం ఓట్లు చాలావరకు కాంగ్రెస్‌నని దీన్నిబట్టి స్పష్టమవుతోంది. 2017లో కాంగ్రెస్‌ దుమ్ము రేపిన సౌరాష్ట్ర ప్రాంతాన్ని కూడా బీజేపీ ఈసారి పూర్తిగా తనవైపు తిప్పుకుంది. కానీ ఇక్కడ ఏకంగా 18 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్, ఆప్‌ రెండింటి ఓట్ల శాతం కలిపితే బీజేపీ కంటే ఎక్కువగా ఉండటం విశేషం! పైగా 2017లో బీజేపీకి చెమటలు పట్టించి కాంగ్రెస్‌కు చాలావరకు ఉపయోగపడ్డ పాటిదార్‌ ఉద్యమం వంటివేవీ ఈసారి లేకపోవడం కమలనాథులకు మరింతగా కలిసొచి్చంది.  – సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

మరిన్ని వార్తలు