ఎంఐ–17వీ5 ప్రమాదంపై త్రివిధ దళాల దర్యాప్తు

10 Dec, 2021 05:21 IST|Sakshi
లోక్‌సభలో మౌనం పాటిస్తున్న ఎంపీలు

ఎయిర్‌ మార్షల్‌ మానవేంద్ర సింగ్‌ నేతృత్వం  

గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం 

మృతులకు పూర్తి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు 

పార్లమెంట్‌ ఉభయ సభల్లో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌  

న్యూఢిల్లీ: ఎంఐ–17వీ5 హెలికాప్టర్‌ ప్రమాదంపై త్రివిధ దళాల దర్యాప్తు ప్రారంభమైనట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటించారు. ఎయిర్‌ మార్షల్‌ మానవేంద్ర సింగ్‌ నేతృత్వంలో దర్యాప్తు సాగుతున్నట్లు చెప్పారు. ఈ ప్రమాదంలో గాయపడి, సైనిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ లైఫ్‌ సపోర్టు సిస్టమ్‌పై ఉన్న ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌(ఐఏఎఫ్‌) గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ ప్రాణాలను కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపారు. రాజ్‌నాథ్‌ గురువారం పార్లమెంట్‌ ఉభయ సభల్లో మాట్లాడారు. హెలికాప్టర్‌ దుర్ఘటన గురించి తెలియజేశారు. ఐఏఎఫ్‌ ఆదేశాల మేరకు దర్యాప్తు బృందం బుధవారమే తమిళనాడులోని వెల్లింగ్టన్‌కు చేరుకుందని, వెంటనే రంగంలోకి దిగి, దర్యాప్తు ప్రారంభించిందని పేర్కొన్నారు. హెలికాప్టర్‌ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌తోపాటు ఇతర సైనికుల అంత్యక్రియలను పూర్తి సైనిక లాంఛనాలతో నిర్వహిస్తామన్నారు. 

ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి 
‘జనరల్‌ రావత్‌ షెడ్యూల్‌ ప్రకారం వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్‌ సర్వీసెస్‌ స్టాఫ్‌ కాలేజీలో విద్యార్థులు, అధికారులతో భేటీ కావాల్సి ఉంది. ఇందుకోసం సూలూరు ఎయిర్‌బేస్‌ నుంచి బుధవారం ఉదయం 11.48 గంటలకు వాయుసేనకు చెందిన ఎంఐ–17వీ5 హెలికాప్టర్‌లో బయలుదేరారు. 12.15 గంటలకు వెల్లింగ్టన్‌లో దిగాల్సి ఉండగా, సూలూరులోని ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌(ఏటీసీ)తో హెలికాప్టర్‌కు మధ్యాహ్నం 12.08 గంటలకు సంబంధాలు తెగిపోయాయి. కూనూరు వద్ద అడవిలో మంటలు చెలరేగుతున్నట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే అక్కడికి చేరుకున్నారు. మంటల్లో చిక్కుకున్న హెలికాప్టర్‌ శిథిలాలు వారికి కనిపించాయి. స్థానిక అధికారులు, సహాయక సిబ్బంది చేరుకున్నారు. క్షతగాత్రులను బయటకు తీసి, వెల్లింగ్టన్‌లోని మిలిటరీ హాస్పిటల్‌కు తరలించారు. మాకు అందిన సమాచారం ప్రకారం.. ప్రమాదం జరిగినప్పుడు హెలికాప్టర్‌లో మొత్తం 14 మంది ఉన్నారు. వీరిలో 13 మంది మరణించారు. ఈ ప్రమాదం గురించి తెలియగానే ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వి.ఆర్‌.చౌదరిని సంఘటనా స్థలానికి పంపించాం’’ అని రాజ్‌నాథ్‌ సింగ్‌ వివరించారు. 

ఉభయ సభల్లో నివాళులు 
తమిళనాడు నీలగిరి కొండల్లో చోటుచేసుకున్న దుర్ఘటనలో మరణించిన వారికి లోక్‌సభ, రాజ్యసభలో ఎంపీలు నివాళులర్పించారు. మృతుల ఆత్మశాంతి కోసం కొద్దిసేపు మౌనం పాటించారు. జనరల్‌ బిపిన్‌ రావత్‌ మృతిపట్ల లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా సంతాపం తెలిపారు. దేశం ఒక గొప్ప యోధుడు, వ్యూహకర్త, అనుభవజ్ఞుడైన నాయకుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బిపిన్‌ రావత్‌ అసాధారణమైన, ఎనలేని పేరు ప్రఖ్యాతలు కలిగిన సైనికాధిపతి అని రాజ్యసభలో డిప్యూటీ స్పీకర్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ కొనియాడారు. రావత్‌ సంతాప సందేశాన్ని సభలో చదివి వినిపించారు. ఆయన అందించిన సేవలను దేశ ప్రజలు, సైనికులు ఎప్పటికీ మర్చిపోలేరని అన్నారు. హెలికాప్టర్‌ ప్రమాదంలో 13 మంది మృతిచెందడం బాధాకరం, దురదృష్టకరమని పేర్కొన్నారు. రాజ్యసభలో ఎంపీలు మౌనం పాటించారు. 

బ్లాక్‌ బాక్స్‌ లభ్యం
చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌(సీడీఎస్‌) బిపిన్‌ రావత్‌ దంపతులతోపాటు మరో 11 మందిని బలిగొన్న ఎంఐ–17వీ5 హెలికాప్టర్‌ ప్రమాదంపై ఆర్మీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. కీలకమైన ఫ్లైట్‌ డేటా రికార్డర్‌(బ్లాక్‌ బాక్స్‌)ను గురువారం వెలికితీశారు. ఘటనా స్థలంలో గాలింపు చేపడుతుండగా 300 మీటర్ల దూరంలో ఇది లభ్యమైందని చెప్పారు. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవడానికి బ్లాక్‌ బాక్స్‌లోని సమాచారం ఉపయోగపడుతుందని అధికారులు భావిస్తున్నారు. ఈ బాక్స్‌ను ఢిల్లీ లేదా బెంగళూరుకు తరలించి, సమాచారాన్ని విశ్లేషించాలని యోచిస్తున్నారు. భారత వైమానిక దళం(ఐఏఎఫ్‌) అధినేత ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వి.ఆర్‌.చౌదరి గురువారం ఘటనా స్థలాన్ని సందర్శించారు. సీనియర్‌ అధికారులతో కలిసి ఆ ప్రాంతాన్ని క్షుణ్నంగా పరిశీలించారు. హెలికాప్టర్‌ ప్రమాదంపై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. 

సోషల్‌ మీడియాలో హెలికాప్టర్‌ వీడియో  
తమిళనాడులోని నీలగిరి కొండల్లో నేలకూలిన ఎంఐ–17వీ5 హెలికాప్టర్‌ పేరిట ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీన్ని నెటిజన్లు విస్తృతంగా షేర్‌ చేశారు. కొండపై దట్టమైన పొగమంచులో వెళ్తున్న హెలికాప్టర్‌ కొన్ని క్షణాల తర్వాత అదృశ్యమైనట్లు ఈ వీడియోలో రికార్డరయ్యింది. ఈ దృశ్యాన్ని ఓ పర్యాటకుడు చిత్రీకరించినట్లు చెబుతున్నారు. అయితే, ఈ వీడియోపై వైమానిక దళం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.   

మరిన్ని వార్తలు