చొరబాట్లను అడ్డుకున్న సైన్యం

24 Sep, 2021 04:29 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న ఆయుధాలు

కశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో సరిహద్దు దాటి భారత భూభాగంలోకి చొరబడేందుకు యత్నించిన ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. హాత్‌లంగా ప్రాంతంలోని ఘటనా స్థలం నుంచి భారీస్థాయిలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు గురువారం సైన్యాధికారి చెప్పారు. హతమైన వారిలో ఒకరు పాకిస్తానీ అని, మిగతా వారి వివరాలు ఇంకా తెలియదని అధికారి పేర్కొన్నారు.

ఉరీ సెక్టార్, గోహలన్‌ ప్రాంతాల్లో చొరబాట్లు జరగొచ్చనే ముందస్తు సమాచారం మేరకు సరిహద్దు వెంట గాలింపు పెంచామని, చివరకు ఇలా ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకున్నామని లెఫ్టినెంట్‌ జనరల్‌ డీపీ పాండే చెప్పారు. మొత్తం ఆరుగురు చొరబాటుకు ప్రయత్నించారని, నలుగురు సరిహద్దు ఆవలే ఉండిపోయారని, ఇద్దరు సరిహద్దు దాటారని, ఎదురుకాల్పుల్లో మొత్తంగా ముగ్గురు హతమయ్యారని వివరించారు. భారత్‌లో ఉగ్రచర్యల్లో పిస్టళ్లను వాడే కొత్త పంథాను పాక్‌ అవలంభిస్తోందని కశ్మీర్‌ జోన్‌ ఐజీ విజయ్‌ కుమార్‌ చెప్పారు. ఈ ఏడాది 97 పిస్టళ్లను సైన్యం స్వాధీనం చేసుకుంది. ఈ ఏడాది నిరాయుధులైన పోలీసులను లక్ష్యంగా చేసుకుని జరిగిన ఉగ్రదాడుల్లో 85 శాతం ఘటనల్లో పిస్టళ్లనే వాడారని ఐజీ పేర్కొన్నారు.

షోపియాన్‌లో మరో ఉగ్రవాది..
షోపియాన్‌ జిల్లాలో కేశ్వా గ్రామంలో భద్రతా బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో అనాయత్‌ అష్రాఫ్‌ అనే ఉగ్రవాది మరణించాడు. అక్రమంగా ఆయుధాలను సమీకరిస్తూ, మాదక ద్రవ్యాల లావాదేవీలు కొనసాగిస్తున్నాడనే పక్కా సమాచారంతో సైన్యం అష్రఫ్‌ను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసింది. లొంగిపోకుండా అష్రఫ్‌ సైన్యం పైకి కాల్పులు జరిపాడు. దీంతో సైన్యం జరిపిన కాల్పుల్లో అతను మృతిచెందాడు.
 

మరిన్ని వార్తలు