లాక్‌డౌన్‌ పొడిగింపు.. కానీ భారీ సడలింపులు

5 Jun, 2021 13:13 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా విజృంభన తగ్గుముఖం పట్టింది. రోజు నమోదయ్యే కేసులు క్రమేణా తగ్గుతున్నాయి. దీంతో రాష్ట్రాలు భారీ సడలింపులతో లాక్‌డౌన్‌ కొనసాగిస్తున్నాయి. ఈ మేరకు లాక్‌డౌన్‌ను జూన్‌ 14వ తేదీ వరకు పొడగిస్తూ ఢిల్లీ, తమిళనాడు, మేఘాలయ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే పేరుకు లాక్‌డౌన్‌ కానీ సడలింపులు భారీగా ఇచ్చారు. కరోనా తీవ్రంగా వ్యాపిస్తున్న ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు విధించగా.. కరోనా తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో ఆంక్షలు సడలిస్తూ ఉత్వర్వులు జారీ చేశాయి. ఇక మహారాష్ట్ర కూడా అన్‌లాక్‌ ప్రక్రియ మొదలుపెట్టనుంది. ఈ మేరకు సోమవారం నుంచి అన్‌లాక్‌కు ఐదంచెల వ్యూహాన్ని రచిస్తోంది. (చదవండి: తగ్గని కరోనా ఉధృతి: లాక్‌డౌన్‌ పొడగింపు)

ఢిల్లీ
ప్రస్తుతం లాక్‌డౌన్‌ ప్రభావంతో కేసులు తగ్గుముఖం పట్టడంతో ఢిల్లీలో అన్‌లాక్‌ ప్రక్రియ మొదలుపెట్టారు. సరి బేసి విధానంలో సడలింపులు ఇచ్చారు. ఆయా ప్రాంతాల్లోని మాల్స్‌, షాపింగ్‌ కాంప్లెక్స్‌ కొన్ని ఒకరోజు.. మరికొన్ని మరుసటి రోజు తెరచుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దుకాణాలు, మార్కెట్లు తెరచుకోవచ్చని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆ దుకాణాలు ఉదయం 10 నుంచి 8 గంటల వరకు తెరుచుకోవచ్చు. నిత్యావసర దుకాణాలు, మెడికల్‌ దుకాణాలు రోజు తెరవచ్చు. ఈ లాక్‌డౌన్‌ను జూన్‌ 14వ తేదీ వరకు పొడగిస్తూ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ శనివారం నిర్ణయం తీసుకున్నారు. అయితే  కరోనా మూడో వేవ్‌కు తాము బాధ్యత వహించమని సీఎం కేజ్రీవాల్‌ ప్రజలకు స్పష్టం చేశారు. అంటే జాగ్రత్తలు పాటిస్తూ తమ కార్యకలాపాలు చేసుకోవాలని సీఎం పరోక్షంగా సూచించారు. కాగా ఢిల్లీలో ఏప్రిల్‌ 18వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ కొనసాగుతోంది.

మేఘాలయ 
ఈశాన్య రాష్ట్రం మేఘాలయ కూడా లాక్‌డౌన్‌ను జూన్‌ 14వ తేదీ వరకు పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా జాగ్రత్తలు పాటిస్తూనే అన్నీ దుకాణాలు తెరచుకోవచ్చని స్పష్టం చేసింది. చాయ్‌ దుకాణాలు తెరచుకునేందుకు మాత్రం అనుమతి ఇవ్వలేదు. ఎందుకంటే కరోనా వ్యాప్తి ఇక్కడే అధికంగా ఉందని గుర్తించి ప్రభుత్వం టీ దుకాణాలపై నిషేధం విధించింది. మార్కెట్లు, దుకాణాలు మధ్యాహ్నం 3 గంటలలోపు మూసివేయాలి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా వెనకాడమని స్పష్టం చేసింది. మే 18వ తేదీ నుంచి ఈ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది.

తమిళనాడు
కరోనా ఉధృతి తగ్గకపోవడంతో తమిళనాడులో లాక్‌డౌన్‌ను పొడగిస్తూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ నిర్ణయం తీసుకున్నారు. జూన్‌ 14వ తేదీ వరకు లాక్‌డౌన్‌ పొడిగిస్తూనే సడలింపులు ఇస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కరోనా తీవ్రత తక్కువగా ఉన్న 27 జిల్లాల్లో స్వల్ప సడలింపులు ఇచ్చింది. ఇక కరోనా తీవ్రత అధికంగా ఉన్న 11 జిల్లాలకు మాత్రం మరికొన్ని ఆంక్షలు విధించింది. కోయంబత్తూరు, నీలగిరిస్‌, తిరుపూర్‌, ఈరోడు, సేలం, కరూర్‌, నమక్కల్‌, తంజావూర్‌, తిరువారూర్‌, నాగపట్టణం, మాయిలదుతూరై కఠిన ఆంక్షలు కొనసాగనున్నాయి. కాగా తమిళనాడులో మే 8వ తేదీ నుంచి లాక్‌డౌన్‌ కొనసాగుతోంది.
 

మరిన్ని వార్తలు