రేప్‌ కేసుల్లో న్యాయం జరగాలంటే...

5 Oct, 2020 14:29 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హథ్రాస్‌ దళిత యువతి అత్యాచారం కేసులో బాధితురాలికి న్యాయం జరగాలంటూ కాంగ్రెస్, దళిత పార్టీలు ఆందోళన చేస్తున్న విషయం తెల్సిందే. ఏ అత్యాచారం కేసులోనైనా బాధితులకు న్యాయం జరగాలంటే ప్రభుత్వం లేదా అధికార యంత్రాంగం ప్రధానంగా మూడు చర్యలు తీసుకోవాల్సి ఉంది. మొదటిది లైంగిక దాడి సాక్ష్యాల కిట్స్‌ను అందుబాటులోకి తీసుకరావడం.

రేప్‌ కేసుల్లో బాధితులకు న్యాయం జరగాలంటే కోర్టు ముందు నిలబడే తిరుగులేని సాక్ష్యాలను బాధితుల నుంచి సేకరించాల్సి ఉంటుంది. వారి నుంచి వివిధ రకాల నమూనాలతోపాటు డీఎన్‌ఏను సేకరించి సీల్డ్‌ బాక్సులో నేరుగా ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించే ప్రత్యేకమైన కిట్లను అందుబాటులోకి తీసుకరావడం. నిర్భయ కేసును దృష్టిలో ఉంచుకొని 2014లో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ‘సెక్సువల్‌ అసాల్ట్‌ ఫోరెన్సిక్‌ ఎవిడేన్స్‌ లేదా సేవ్‌’ కిట్ల ఆవశ్యకత గురించి తెలియజేస్తూ అందుకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా సూచించింది.  (హథ్రాస్‌: న్యాయం చేసే ఉద్దేశముందా?)

2019 వరకు అందుబాటులో ఉన్న డేటా ప్రకారం కేవలం తొమ్మిదంటే తొమ్మిది రాష్ట్రాలు మాత్రమే కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలను అమలు చేశాయని, సేఫ్‌ కిట్లను సేకరించాయని తెల్సింది. 16 నిమిషాలకు ఓ అత్యాచారం జరుగుతున్న భారత్‌లో  దేశవ్యాప్తంగా 3,120 సేఫ్‌ కిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయని ‘బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రీసర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌’వర్గాలు తెలిపాయి. ఇలాంటి కిట్లు ప్రస్తుతం అమెరికాలో లక్షల్లో ఉన్నాయి. గత ఆరు నెలల్లో ఇలాంటి కిట్ల ద్వారా సేకరించిన డీఎన్‌ఏ సాక్ష్యాధారాలతోనే రాజస్థాన్, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడులోని పలు కోర్టులు నేరస్థులకు సకాలంలో శిక్షలు విధించగలిగాయి. హథ్రాస్‌ దళిత యువతి రేప్‌ కేసులో సేఫ్‌ కిట్లను ఉపయోగించినట్లయితే సాక్ష్యాధారాలను తారుమారు చేశారన్న ఆరోపణలుగానీ, అనుమానాలుగానీ వ్యక్తం అయ్యేవి కావు. (రేప్‌ కేసుల్లో బాధితుల పేర్లు వెల్లడిస్తే..)

రేప్‌ కేసుల్లో బాధితులకు న్యాయం జరగాలంటే పోలీసులకు, నర్సులకు, వైద్యులకు తగిన శిక్షణ అవసరం. నిర్భయ గ్యాంగ్‌ రేప్‌ నేపథ్యంలో క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌లోకి 357 సీ సెక్షన్‌ ప్రకారం రేప్‌ బాధితులకు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు ఉచితంగా వైద్య చికిత్సను అందించాలి. దీనికి సంబంధించి 2014లో కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం, ప్రైవేటు అనే తేడా లేకుండా వైద్యులు, నర్సులు రేప్‌ బాధితులు మానసిక ఒత్తిడికి గురికాకుండా అండగా ఉండాలి. 

ఎవరి ఒత్తిళ్లకు లొంగకుండా బాధితులకు సేఫ్‌ కిట్లతో పరీక్షలు నిర్వహించి, వాటి ఫలితాలను భద్రంగా ఉంచాలి. రేప్‌ కేసుల్లో సాక్ష్యాధారాల సేకరణకు మూడు నుంచి ఆరు గంటల సమయం పడుతుంది కనుక వైద్య సిబ్బందికి ఎంతో క్రమశిక్షణ అవసరం. అత్యాచార కేసుల్లో బాధితులు మరణించిన పక్షంలో వారి మత దేహాలను కొంతకాలం పాటు భద్రపర్చాలి. అనుమానాలు వ్యక్తం అయిన సందర్భాల్లో మరోసారి ఫోరెన్సిక్‌ పరీక్షలు నిర్వహించేందుకు వీలుంటుంది. మతదేహాన్ని దహనం చేయకుండా పూడ్చి పెట్టినట్లయితే సాక్ష్యాధారాలను సేకరించేందుకు వీలుంటుంది. భారత్‌లాంటి దేశంలో మెజారిటీ సామాజిక వర్గాల ప్రజలు దహన సంస్కారాలే చేస్తారు. (హత్రాస్‌ ఉదంతం.. ఐదుగురు పోలీసులపై సస్పెన్షన్‌ వేటు)

హథ్రాస్‌ రేప్‌ కేసులో బాధితురాలు మంగళవారం ఉదయం మరణించగా, ఆ రోజు అర్ధరాత్రి పోలీసులు ఆమె మతదేహాన్ని దహనం చేయడం తెల్సిందే. ఆ మరుసటి రోజే బాధితురాలిపై అత్యాచారం జరగలేదంటూ పోలీసులు ఫోరెన్సిక్‌ నివేదికను బయట పెట్టారు. దానిపై సర్వత్ర అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరోసారి ఫోరెన్సిక్‌ పరీక్షలు నిర్వహించేందుకు బాధితురాలి మృతదేహం లేకుండా పోయింది. ఈ విషయంలో పోలీసులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, చట్టం ముందు దోషులను నిరూపించేందుకు పోలీసులకు కూడా తగిన శిక్షణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు