మహాకాల్‌ లోక్‌లో గాలివాన బీభత్సం.. పిడుగుపడి ముగ్గురి దుర్మరణం

29 May, 2023 10:27 IST|Sakshi

ఉజ్జయిని: హఠాత్తుగా మొదలైన ఈదురు గాలులు, ఉరుములు..మెరుపులతో కూడిన వర్షం మధ్యప్రదేశ్‌ ఉ‍జ్జయినిలో విధ్వంసం సృష్టించింది. అదే సమయంలో.. మహాకాళ్‌ లోక్‌ ఆలయ ప్రాంగణంలో పిడుగు పడి ముగ్గురు మరణించారు. మరికొంతమందికి గాయాలు కాగా, అక్కడ ఏర్పాటు చేసిన పలు విగ్రహాలు దారుణంగా దెబ్బతిన్నాయి. 

ఆదివారం సాయంత్రం నుంచి కురిసిన వర్ష బీభత్సానికి ఉజ్జయిని అతలాకుతలం అయ్యింది. భారీ సంఖ్యలో చెట్లు విరిగిపడగా.. చాలాచోట్ల కరెంట్‌ స్తంభాలు నేలకొరిగి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇక వారాంతం కావడంతో.. ఆదివారం పాతిక వేల మందికి పైగా మహాకాళ్‌ లోక్‌ను సందర్శించినట్లు తెలుస్తోంది. భారీగా సందర్శకులు మహాకాళ్‌ లోక్‌కు రాగా.. ఆ సమయంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటుచేసున్నారు. బలంగా ఈదురుగాలులు వీయడంతో పాటు పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. పిడుగులు పడి ముగ్గురు మరణించారు. మరికొంతమంది గాయాలతో చికిత్స పొందుతున్నారు.

గాలుల ధాటికి ఆలయ కారిడార్‌లో ఏర్పాటు చేసిన సప్తరుషి విగ్రహాలు పక్కకు జరిగాయి. అందులో రెండు పూర్తిగా ధ్వంసం అయినట్లు తెలుస్తోంది.  ఈ కారిడార్‌లో మొత్తం 155 విగ్రహాలు ఉండగా.. దెబ్బ తిన్న విగ్రహాలను వీలైనంత త్వరగా పునరుద్ధరిస్తామని జిల్లా మెజిస్ట్రేట్‌(కలెక్టర్‌) చెబుతున్నారు.మహాకాల్‌ లోక్‌ ఆలయ కారిడార్‌ను ప్రధాని నరేంద్ర మోదీ కిందటి ఏడాది అక్టోబర్‌లో ప్రారంభించిన సంగతి తెలిసిందే.

అపూర్వం.. అమోఘం.. మహాకాళ్‌ లోక్ (ఫొటోలు)

మరిన్ని వార్తలు