రైళ్లలో రద్దీ నివారణకే చార్జీల పెంపు

25 Feb, 2021 01:13 IST|Sakshi

అనవసర ప్రయాణాలు మానుకోండి 

కరోనా వ్యాప్తి నివారణ కోసమే ఈ చర్య తీసుకున్నాం

రైల్వే శాఖ వెల్లడి

న్యూఢిల్లీ: రైళ్లలో స్వల్ప దూరాలు ప్రయాణించే వారు గగ్గోలు పెడుతున్నారు. టిక్కెట్‌ చార్జీలు పెరగడమే ఇందుకు కారణం. ప్యాసింజర్, లోకల్‌ ట్రైన్లలో చార్జీలను రైల్వే శాఖ ఇటీవలే పెంచేసింది. అయితే, కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో అనవసర ప్రయాణాలను నివారించడానికే ప్యాసింజర్, తక్కువ దూరం ప్రయాణించే రైళ్లలో చార్జీలను స్వల్పంగా పెంచినట్లు రైల్వే అధికారులు తాజాగా ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప ఈ రైళ్లలో ప్రయాణించకపోవడమే మంచిదని సూచించారు.

‘‘కరోనా ముప్పు ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. కొన్ని రాష్ట్రాల్లో మళ్లీ విజృంభిస్తోంది. రైళ్లలో, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీని అరికట్టడంతోపాటు ఒకరి నుంచి మరొకరికి కరోనా వ్యాప్తి చెందకుండా నివారించే చర్యల్లో భాగంగానే చార్జీలను పెంచాల్సి వచ్చింది’’ అని రైల్వేశాఖ బుధవారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. లాక్‌డౌన్‌ కారణంగా రద్దు చేసిన ప్యాసింజర్‌ రైళ్ల కార్యకలాపాలు క్రమంగా పెరుగుతున్నాయి. లాక్‌డౌన్‌ ముందునాటి పరిస్థితితో పోలిస్తే ప్రస్తుతం 65 శాతం ఎక్స్‌ప్రెస్‌లు, 90 శాతానికి పైగా సబర్బన్‌ సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ప్రతిరోజూ దేశవ్యాప్తంగా 1,250 మెయిల్‌/ఎక్స్‌ప్రెస్‌ రైల్లు, 5,350 సబర్బన్‌ సర్వీసులు, 326 ప్యాసింజర్‌ రైళ్లు నడుస్తున్నాయి.  

మరిన్ని వార్తలు