పులి తీయించుకున్న ఫస్ట్‌ ఫొటో.. స్పెషల్ ఏంటో తెలుసా?

17 Jun, 2022 14:40 IST|Sakshi

అడవుల్లో వేటాడుతున్న పులి చిత్రాలు మనం చాలా చూసి ఉంటాం.. ఇది కూడా అలాంటిదే అనుకోవద్దు. దీనికో ప్రత్యేకత ఉంది. ఇది మన దేశంలోని అడవుల్లో పులి వేటాడుతుండగా తీసిన తొలి చిత్రం. ఈ ఫొటోను అప్పటి ఐఎఫ్‌ఎస్‌ అధికారి ఫ్రెడ్రిక్‌ వాల్టర్‌ చాంపియన్‌ తీశారు. 1925లో ఆయన  తీసిన ఈ ఫొటో ‘ది ఇలస్ట్రేటెడ్‌ లండన్‌ న్యూస్‌’ పత్రిక  మొదటి పేజీలో ప్రచురితమైంది. ఈ విషయాన్ని నార్వేకు చెందిన మాజీ రాయబారి ఎరిక్‌ సొహైమ్‌ ట్విట్టర్‌లో షేర్‌ చేశారు.

ఫ్రెడ్రిక్‌ 1947 వరకూ బ్రిటిష్‌ సైన్యంలో ఉత్తరప్రదేశ్‌ అటవీ శాఖ అధికారిగా పనిచేశారు. వన్యప్రాణులను వేటాడకుండా.. తన తోటి అధికారులకు భిన్నంగా వాటిని తన కెమెరాలో బంధించడంపై ఆసక్తి చూపేవారు. పులులను సహజసిద్ధమైన అటవీ వాతావరణంలో ఉండగా ఫొటో తీయాలన్నది ఫ్రెడ్రిక్‌ కల.. ఎనిమిదేళ్ల ప్రయాస అనంతరం ఆయన ట్రిప్‌–వైర్‌ ఫొటోగ్రఫీ ద్వారా తాను అనుకున్నది సాధించారు.

ట్రిప్‌ వైర్‌ ఫొటోగ్రఫీ అంటే.. కెమెరాకు తగిలించిన వైరును జంతువులు తిరుగాడే ప్రాంతాల్లో ఉంచుతారు. వాటి కాలు తగలగానే.. వైర్‌ లాగినట్లు అయి.. ఫొటో క్లిక్‌మంటుంది. అదే టెక్నిక్‌ తర్వాతి కాలంలో మరింత అభివృద్ధి చెంది.. కెమెరా ట్రాప్‌ ఫొటోగ్రఫీగా మారింది. ప్రస్తుతం పులుల గణనకు, పరిశీలనకు దీన్నే ప్రామాణికంగా వాడుతున్నారు. 
    – సాక్షి సెంట్రల్‌డెస్క్‌

మరిన్ని వార్తలు