టైమ్స్‌ గ్రూప్‌ చైర్‌పర్సన్‌ ఇందూజైన్‌ కన్నుమూత

14 May, 2021 11:09 IST|Sakshi

ముంబై: కరోనా వైరస్ దేశంలో వినాశనం సృష్టిస్తూనే ఉంది. గత ఏడాది నుంచి ఇప్పటివరకు ఈ వైరస్ సామాన్యులతో పాటు వేలాది మంది ప్రముఖులను సైతం పొట్టన బెట్టుకుంటోంది. తాజాగా  టైమ్స్‌ గ్రూప్‌ చైర్‌పర్సన్‌ ఇందూ జైన్‌(84) కరోనా మహమ్మరి బారినపడి గురువారం కన్నుమూశారు. భారతదేశంలో మీడియా రంగంలో ఆమె తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. 1999లో గ్రూప్‌ యాజమాన్య బాధ్యతలు చేపట్టిన జైన్‌, సంస్థ స్థాయిని పెంచడంలో కృషి చేశారు. 2000లో టైమ్స్‌ ఫౌండేషన్‌ను స్థాపించి సేవా కార్యక్రమాల్లో దేశంలోనే ఉత్తమ ఎన్‌జీవోగా తీర్చిదిద్దారు. 

1983లో ఏర్పాటైన ఫిక్కి లేడీస్‌ ఆర్గనైజేషన్‌(ఎఫ్‌ఎల్‌వో) వ్యవస్థాపక ప్రెసిండెంట్‌గా వ్యవహరించారు. భారతీయ భాషా సాహిత్యాభివృద్ధిని కాంక్షిస్తూ తన మామ సాహు శాంతి ప్రసాద్‌ జైన్‌ స్థాపించిన భారతీయ జ్ఞాన్‌పీఠ ట్రస్ట్‌కు 1999 నుంచి చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్నారు. ఈ ట్రస్ట్‌ ఏటా జ్ఞానపీఠ అవార్డులను అందజేస్తుంటుంది. 2016లో కేంద్రం ఆమెను పద్మ భూషణ్‌తో సత్కరించింది. 84 ఏళ్ల ఇందూ జైన్ మీడియా ప్రపంచంలోనే కాకుండా, అనేక సామాజిక కార్యక్రమాలను కూడా నిర్వహించారు.

ప్రధాని మోదీ సంతాపం
ఆమె మృతి పట్ల పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. టైమ్స్ గ్రూప్ ఛైర్‌పర్సన్ ఇందూ‌జైన్ మృతి విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఇందూ జైన్ సమాజ సేవా కార్యక్రమాలు, భారతదేశం పురోగతి పట్ల అభిరుచి, సంస్కృతిపై ఆసక్తి ఉన్న వ్యక్తి అని మోదీ గుర్తు చేసుకున్నారు. ఇందూ జైన్ కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని ప్రధాని మోదీ తెలిపారు. అమె మృతి పట్ల రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు.

చదవండి:

ఆక్సిజన్‌ అందక మరో 15 మంది మృత్యువాత

మరిన్ని వార్తలు