అమిత్‌ షాపై దారుణంగా ట్రోల్స్‌

9 Sep, 2022 14:46 IST|Sakshi

బెంగాల్‌ టీఎంసీ నేతలు, బీజేపీ నేతల మధ్య మాటల వార్‌ నడుస్తోంది. కొద్దిరోజులుగా బెంగాల్‌లోని టీఎంసీ నేతలపై ఈడీ దాడులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాను టార్గెట్‌ చేసి టీఎంసీ నేతలు షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. 

వివరాల ప్రకారం.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై నేరుగా దాడికి దిగారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు బెంగాల్‌లోని పలువురు మంత్రులను టార్గెట్ చేయడంతో అమిత్‌ షాను ‘ఇండియాలోనే అతిపెద్ద పప్పు’ అని అన్నారు. అభిషేక్.. అమిత్‌ షాను కామెంట్‌ చేసిన అనంతరమే.. దేశంలోనే అతిపెద్ద పప్పు అనే క్యాప్షన్ ఉన్న టీ-షర్టులను టీఎంసీ కార్యకర్తలకు పంపిణీ చేశారు. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలపై అభిషేక్ బెనర్జీ వివరణ ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒకసారి ఢిల్లీ నేరాల రేటు చూడండి. కోల్‌కతాలో క్రైమ్ రేట్ తక్కువగా ఉందని మీ స్వంత ఏజెన్సీ తెలిపింది. ఢిల్లీ పోలీసులు మాత్రం హోం మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉన్నారు. అయినా అక్కడ క్రైమ్ రేట్ ఏ స్థాయిలో ఉందో చూడండి. అమిత్‌షా అందరికీ జాతీయవాదాన్ని బోధిస్తారు. కానీ తన కొడుకు బీసీసీఐ కార్యదర్శి జై షాకి మాత్రం జాతీయ జెండా పట్టుకోవడంలో ఇబ్బంది ఉంది. ముందుగా అతనికి నేర్పించండి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా, ఆసియా కప్‌లో భారత్‌, పాకిస్తాన్‌ మ్యాచ్‌ సందర్భంగా జై షా జాతీయ జెండాను ఊపేందుకు నిరాకరించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి. 

ఇదిలా ఉండగా.. “మాకింగ్ అనేది కమ్యూనికేట్ చేయడంలో అత్యంత శక్తివంతమైన రూపం. ఇది మా జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ చేసిన వ్యాఖ్య నుంచి ప్రారంభమైంది. ఇది సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. అది టీ-షర్టులపైకి వచ్చింది” అని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ చెప్పారు. కాగా, టీ షర్టులు తెలుపు, పసుపు, బ్లాక్‌ రంగుల్లో వస్తున్నాయని వీటిని ఆన్‌లైన్ నుంచి కొనుగోలు చేయవచ్చని తెలిపారు. టీ షర్టు ధరను రూ. 300గా నిర్ణయించినట్టు స్పష్టం చేశారు. 

మరిన్ని వార్తలు