వైరలవుతోన్న టీఎంసీ నాయకుడి సాహసం

13 Aug, 2020 14:24 IST|Sakshi
బాధితుడు అమల్‌​ బారిక్‌ను పీపీఈ కిట్‌ ధరించి ఆస్పత్రికి తీసుకెళ్తున్న సత్యకం పట్నాయక్‌

కోల్‌కతా: కరోనా వైరస్‌ మనిషిని చంపితే.. భయం మనలోని మానవత్వాన్ని చంపుతోంది. కళ్లెదుట మనిషి చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నా దగ్గరకు వెళ్లి సాయం చేయట్లేం. కారణం వారికి కరోనా ఉంటే మనకు సోకుతుంది. ఎందుకు వచ్చిన తలనొప్పి అని ఎవరికి వారే దూరంగా ఉంటున్న పరిస్థితి. ఈ క్రమంలో పశ్చిమబెంగాల్‌ టీఎంసీ నాయకుడు చూపిన సాహసం ప్రస్తుతం తెగ వైరలవ్వడమే కాక ప్రశసంలు పొందుతుంది. వివరాలు.. గోపిబల్లవపూర్‌కు చెందిన అమల్‌ బారిక్‌(43) ఉపాధి నిమిత్తం వేరే రాష్ట్రం వెళ్లాడు. లాక్‌డౌన్‌ కారణంగా సొంత ఊరికి వచ్చాడు. ఈ నేపథ్యంలో గత 5-6 రోజులుగా విపరీతమైన జ్వరంతో బాధపడుతున్నాడు. ఆస్పత్రి వెళ్లడానికి కూడా ఓపిక లేదు. దాంతో బారిక్‌ భార్య ఇరుగుపొరుగును సాయం కోరింది. కానీ కరోనా భయంతో ఎవరూ ముందుకు రాలేదు. అంబులెన్స్‌, ప్రైవేట్‌ వాహనం బుక్‌ చేసుకునేంత ఆర్థిక స్థోమత లేదు వారికి. దాంతో ఏం చేయాలో తెలీక బాధపడుతోంది. (కరోనా జీవితం పోరాటంగా మారింది)

అయితే ఈ విషయం గురించి గోపిబల్లవపూర్‌ యూత్‌ వింగ్‌ ప్రెసిడెంట్‌ సత్యకం పట్నాయక్‌కు తెలిసింది. దాంతో ఇతర కార్యకర్తలతో మాట్లాడి ఓ బైక్‌ ఏర్పాటు చేసుకున్నాడు. మెడికల్‌ షాప్‌కు వెళ్లి పీపీఈ కిట్‌ తెచ్చుకున్నాడు. అనంతరం బారిక్‌ ఇంటికి వెళ్లి అతడిని బైక్‌ మీద కూర్చోపెట్టుకుని సమీప ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ వైద్యులు బారిక్‌ను పరీక్షించి కొన్ని మందులు ఇచ్చి.. ఇంట్లోనే ఉండి రెస్ట్‌ తీసుకోమని తెలిపారు. పట్నాయక్‌ తిరగి అతడిని ఇంటికి చేర్చాడు. పీపీఈ కిట్‌ ధరించి బైక్‌ మీద బారిక్‌ను ఆస్పత్రికి తీసుకెళ్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైలయ్యింది. దీని గురించి పట్నాయక్‌ మాట్లాడుతూ.. ‘బారిక్‌ పరిస్థితి తెలిసి.. కామ్‌గా ఉండలేకపోయాను. నా కళ్ల ముందు ఎవరైనా బాధపడుతుంటే చూడలేను. దాంతో పీపీఈ కిట్‌ ధరించి అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లాను’ అన్నాడు. (కరోనా బారిన రామ జన్మభూమి ట్రస్టు ఛైర్మన్)

అంతేకాక ‘పాపం నేను అతడికి ఇంటికి వెళ్లేసరికి బారిక్‌ భార్య, ఇద్దరు కుమారులు అతడి పరిస్థితి గురించి తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఆస్పత్రికి తీసుకెళ్తానని తెలిసి బారిక్‌ భార్య మాతో పాటు హస్పటల్‌కి వస్తానంది. కానీ ఆమెకు నచ్చచెప్పి అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లి.. వైద్యం చేయించి తీసుకువచ్చాను. ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో వుంటే వారికి కూడా సాయం చేస్తాను. అందుకే మరో 4 పీపీఈ కిట్లు కూడా ఆర్డర్‌ చేశాను’ అని తెలిపాడు. పట్నాయక్‌ పీపీఈ కిట్‌ ధరించి బారిక్‌ను ఆస్పత్రికి తీసుకెళ్తున్న వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. అతడి మంచి మనసును ప్రశంసిస్తున్నారు నెటిజనులు.

మరిన్ని వార్తలు