టీఎంసీకి ఎదురుదెబ్బ.. విశ్వాస పరీక్షలో ఓటమి.. కాంగ్రెస్‌కు ఆ స్థానం అప్పగింత!

21 Nov, 2022 20:42 IST|Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో అధికార పక్షానికి ఎదురు దెబ్బ తగిలింది. విశ్వాస పరీక్షలో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఓటమి పాలైంది. అయితే అది బెంగాల్‌ శాసన సభలో కాదు!..

బెంగాల్‌ రాజకీయాలకు 2023 పంచాయితీ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. అంతకంటే ముందే అధికార టీఎంసీకి ఝలక్‌ తగిలింది. పురూలియా జిల్లా ఝల్దా మున్సిపాలిటీలో నిర్వహించిన విశ్వాస పరీక్షలో తృణమూల్‌ పార్టీ ఓడింది. అంతకు ముందు.. ఇక్కడ విశ్వాస పరీక్ష నిర్వహించాల్సిందేనంటూ అధికార పక్షానికి మొట్టికాయలు వేసింది కోల్‌కతా హైకోర్టు. దీంతో 12 వార్డులు ఉన్న ఝల్దా మున్సిపాలిటీలో సోమవారం విశ్వాస పరీక్ష నిర్వహించారు. 

మొత్తం 12 వార్డుల్లో ఐదు తృణమూల్‌, మరో ఐదు కాంగ్రెస్‌ ఖాతాలో ఉన్నాయి. ఇంకో రెండు చోట్ల ఇండిపెండెంట్‌ కౌన్సిలర్లు కైవసం చేసుకున్నారు. సోమవారం జరిగిన ఓటింగ్‌లో స్వతంత్రులు, కాంగ్రెస్‌ సభ్యులు పాల్గొనడంతో.. సంఖ్యా బలం ఆధారంగా టీఎంసీ ఓటమి పాలైంది. ఇండిపెండెంట్‌ అభ్యర్థులిద్దరూ కాంగ్రెస్‌కే మద్ధతు ఇచ్చారు. 

ఇదిలాఉంటే.. ఝల్దా మున్సిపాలిటీ చైర్మన్‌ సురేష్‌ అగర్వాల్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు ప్రతిపక్ష కౌన్సిలర్లు. ఇందుకు సంబంధించి కేసు నమోదు కావడంతో.. హైకోర్టు సైతం విశ్వాస పరీక్ష నిర్వహించాలని ఝల్దా బోర్డును ఆదేశించింది కూడా. 

మద్ధతు వెనక్కి..
ఝల్దా మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ తపన్‌ కండు మరణంతో ఉప ఎన్నిక జరిగింది. మార్చి 13వ తేదీన తపన్‌ హత్యకు గురికాగా.. ఆ ప్లేసులో ఆయన మేనల్లుడు మిథున్‌ విజయం సాధించారు. ఈలోపే స్వతంత్ర అభ్యర్థి షీలా ఛటోపాధ్యాయ మద్దతుతో మున్సిపల్‌ బోర్డును ఏర్పాటు చేసింది టీఎంసీ. దీనిపై ప్రతిపక్ష కౌన్సిలర్‌లు అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అయితే.. దుర్గా పూజ తర్వాత షీలా తన మద్ధతు ఉపసంహరించుకోవడంతో ఝుల్దా మున్సిపాలిటీ అధికారం ఊగిసలాటకు చేరుకుంది. అభివృద్ధి కొరవడిందని కారణంతో షీలా తన మద్దతును వెనక్కి తీసుకున్నారు. ఆ తర్వాతే బోర్డుకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం తెర మీదకు వచ్చింది. 

ఇదిలా ఉంటే..  2022 ఫిబ్రవరిలో 108 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగ్గా.. 102 స్థానాలకు సొంతం చేసుకుంది టీఎంసీ. సీపీఐ(ఎం) ఒక్కస్థానంలో ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. ఇక బీజేపీ ఒక్క స్థానంలో కూడా గెలుపొందలేదు. నాలుగు స్థానాల్లో హంగ్‌ ఫలితం వచ్చింది. ఇక ఇప్పుడు 101లో ఝల్దా విశ్వాస పరీక్షలో ఓటమి ద్వారా ఒక స్థానం కోల్పోయింది టీఎంసీ. ఓడింది ఒక్క స్థానమే అయినా.. అదీ మున్సిపాలిటీ అయినా.. దాని వెనుక జరిగిన రాజకీయం గురించి రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరిగింది. ప్రముఖ నేతలంతా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారు. అయితే హైకోర్టు నుంచి అక్షింతలు వేయించుకోవడంతో పాటు ఆపై విశ్వాస పరీక్షలో ఓడి ఝల్దాను చేజార్చుకుంది టీఎంసీ.

మరిన్ని వార్తలు