వీడియో: మన రాష్ట్రపతి ఎలా ఉంటారు?.. ముర్ముపై మంత్రి వ్యాఖ్యలు.. బీజేపీ ఫైర్‌

12 Nov, 2022 09:51 IST|Sakshi

కోల్‌కతా: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై పశ్చిమ బెంగాల్‌ మంత్రి అఖిల్‌ గిరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. నందిగ్రామ్‌లో జరిగిన ఓ పబ్లిక్‌ ర్యాలీలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.. రాజకీయ విమర్శలకు కారణం అయ్యాయి. 

మన రాష్ట్రపతి ఎలా ఉంటారు?.. అంటూ ఆయన చేసిన కామెంట్ల తాలుకా వీడియో ఒకటి వివాదాస్పదంగా మారింది. ‘‘ఆయన(బీజేపీ నేత సువేందు అధికారి).. నేను (అఖిల్‌ గిరి) చూడడానికి బాగోలేను అన్నాడు. మరి ఆయనెంత అందంగా ఉన్నాడు?. ఒకరిని అప్పీయరెన్స్‌ బట్టి అలా నిర్ణయించకూడదు. అంతెందుకు మనం మన రాష్ట్రపతి కుర్చీకి గౌరవం ఇస్తాం. మరి ఆ రాష్ట్రపతి చూడానికి ఎలా ఉంటారు?’’ అని అఖిల్‌ గిరి అక్కడ ఉన్న కార్యకర్తలను, ప్రజలను ఉద్దేశించి ప్రశ్నించారు. ఈ క్రమంలో అక్కడున్న వాళ్లు ఈలలు, చప్పట్లతో అఖిల్‌ను మరింత ప్రొత్సహించారు.

ఇక టీఎంసీ నేత చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. ప్రతిపక్ష బీజేపీ.. టీఎంసీ తీరును తీవ్రంగా తప్పుబట్టింది. గిరిజనులకు మమతా బెనర్జీ, ఆమె నేతృత్వంలోని టీఎంసీ పార్టీ వ్యతిరేకమని విమర్శించింది. మరో మంత్రి.. అదీ మహిళా సంక్షేమ శాఖ మంత్రి శశి పంజా సమక్షంలో అఖిల్‌ గిరి ఈ వ్యాఖ్యలు చేయడాన్ని బీజేపీ హైలెట్‌ చేసింది. 

బీజేపీ నేత అమిత్‌ మాలవియా.. టీఎంసీ నేతపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మమతా బెనర్జీ కేబినెట్‌లోని అఖిల్‌ గిరి.. రాష్ట్రపతిని ఘోరంగా అవమానించారు. అప్పుడు రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి ముర్ముకు మమతా బెనర్జీ మద్దతు ఇవ్వలేదు. ఇప్పుడేమో ఇలా అవమానించడాన్ని ప్రొత్సహిస్తున్నారు అంటూ ట్వీట్‌ చేశారాయన. 

ఇదీ చదవండి:  కేజ్రీవాల్‌ ఎంట్రీతో మారిన హిమాచల్‌ సీన్‌

మరిన్ని వార్తలు