లాటరీలో ఎమ్మెల్యే భార్యకు రూ.కోటి జాక్‌పాట్‌.. బీజేపీ మనీలాండరింగ్‌ ఆరోపణ

29 Oct, 2022 14:41 IST|Sakshi

కోల్‌కతా: లాటరీలో ఓ ఎమ్మెల్యే భార్యకు రూ.కోటి జాక్‌పాట్ తగిలింది. అయితే, అది లాటరీ పేరుతో మనీలాండరింగ్‌కి పాల్పడటమేనని బీజేపీ ఆరోపణలు చేసింది. ఈ సంఘటన పశ్చిమ బెంగాల్‌లో జరిగింది. టీఎంసీ ఎమ్మెల్యే వివేక్‌ గుప్తా భార్య లాటరీలో రూ.కోటి గెలుచుకున్నారు. ఈ క్రమంలో బెంగాల్‌ ప్రతిపక్ష నేత సువేందు అధికారి ట్విటర్‌ వేదికగా విమర్శలు గప్పించారు. లాటరీ ద్వారా అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ మనీలాండరింగ్‌(అక్రమ నగదు బదిలీ)కి పాల్పడుతోందని ఆరోపంచారు.

‘టీఎంసీకి, లాటరీ సంస్థకు మధ్య సంబంధాలు ఉన్నాయని నేను చెబుతూనే ఉన్నాను. మనీలాండరింగ్‌కు పాల్పడేందుకు ఇది సులభమైన మార్గం. సామాన్య ప్రజలు టికెట్లు కొంటారు. కానీ, టీఎంసీ నేతలు బంపర్‌ ప్రైజ్‌ గెలుస్తారు. తొలుత అనుబ్రాత మొండల్‌ ఈ జాక్‌పాట్‌ గెలిచారు. ఇప్పుడు టీఎంసీ ఎమ్మెల్యే వివేక్‌ గుప్తా భార్య కోటి రూపాయలు గెలచుకున్నారు.’

- సువేందు అధికారి, బీజేపీ నేత

ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు లేఖ రాసినట్లు చెప్పారు సువేందు ‍అధికారి. డియర్‌ లాటరీకి బెంగాల్‌లో పెద్ద మార్కెట్ ఉందని, ‍అయితే, లాటరీలు ‍అక్రమమని పేర్కొన్నారు. ‍లాటరీని అక్రమ పద్ధతిలో నిర్వహిస్తున్నారు.. దానిపై పూర్తిస్థాయి విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని లేఖలో తెలిపారు. మరోవైపు.. సువేందు అధికారి ఆరోపణలను ఖండించారు ఎమ్మెల్యే వివేక్ గుప్తా. తన భార్యపై రాజకీయ ఆరోపణలు చేయటం సరికాదన్నారు. తనకు రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఆజంఖాన్‌ ఖాన్‌కు షాక్‌.. శాసనసభ్యత్వం రద్దు

మరిన్ని వార్తలు