పశ్చిమబెంగాల్‌ పరిణామాలపై కీలక వ్యాఖ్యలు

12 Feb, 2021 15:16 IST|Sakshi

రాజ్యసభకు దినేశ్‌ త్రివేది రాజీనామా

గతేడాది రాజ్యసభకు ఎంపిక

మన్మోహన్‌ సింగ్‌ హయాంలో కేంద్ర మంత్రిగా బాధ్యతలు

న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన ఏడాదిలోనే కేంద్ర మాజీ మంత్రి దినేశ్‌ త్రివేది తన సభ్యత్వానికి రాజీనామా చేశారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యుడిగా ఉన్న ఆయన అకస్మాత్తుగా రాజీనామా చేయడంతో ఆ పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి షాక్‌ తగిలింది. అయితే ఆయన ఎప్పటి నుంచో బీజేపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇటీవల రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్రమోదీని అభినందించారు. ఆ తెల్లారి ఆయన రాజ్యసభకు రాజీనామా చేయడం బెంగాల్‌లో కీలక పరిణామంగా మారింది. 

2019 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోయిన దినేశ్‌ త్రివేదిని గతేడాది తృణమూల్‌ కాంగ్రెస్‌ రాజ్య‌స‌భ‌కు పంపించింది. అయితే పశ్చిమబెంగాల్‌లో రోజురోజుకు పరిణామాలు మారుతున్నాయి. బీజేపీలోకి తృణమూల్‌ పార్టీ నాయకుల వలసలు పెరగడంతో ఈ క్రమంలోనే ఆయన కూడా రాజ్యసభకు రాజీనామా చేశారని తెలుస్తోంది. రాజీనామా చేసిన సందర్భంగా దినేశ్‌ త్రివేది బెంగాల్‌లో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. 

‘పశ్చిమ బెంగాల్‌లో రాజ‌కీయ హింస జ‌రుగుతున్నా నేను నిస్స‌హాయుడిగా మిగిలిపోయా. బెంగాల్‌లో జ‌రుగుతున్న హింసతో ప్ర‌జాస్వామ్యానికి ముప్పు వాటిల్ల‌నుంది. ఇక్క‌డ కూర్చోవ‌డం నాకు చాలా వింత‌గా అనిపిస్తోంది. నేను ఏం చేయాలి అని ఆలోచిస్తున్నా. ఇక్క‌డ కూర్చున్నా నేనేమీ మాట్లాడ‌లేక‌పోతున్నా. మ‌రి ఏం లాభం. అందుకే రాజీనామా చేస్తున్నా’ అని త్రివేది ప్రకటించారు.

‘పార్టీ ఆదేశాల‌ను పాటించాల‌ని ఉన్నా తాను ఏమీ చేయ‌లేని ప‌రిస్థితుల్లో ఉన్నా. న‌న్ను ఇక్క‌డికి పంపినందుకు పార్టీకి కృతజ్ఞ‌త‌లు. నేను రాష్ట్రానికి సేవ చేయాల‌ని అనుకుంటున్నా’ అని దినేశ్‌ త్రివేది చెప్పారు. ఆయ‌న రాజీనామా తృణ‌మూల్‌ను షాక్‌కు గురి చేసింది. అయితే ముందు నుంచే ఆయ‌న రాజీనామా సంకేతాలు ఇచ్చారు. గురువార‌మే దినేష్ త్రివేదీ.. ప్ర‌ధాని మోదీ ప్ర‌సంగాన్ని అభినందించారు. ఆయ‌న ఇలా చేస్తార‌ని అనుకోలేద‌ని తృణ‌మూల్ కాంగ్రెస ఎంపీ సౌగ‌తా రాయ్ అన్నారు. 

1980లో కాంగ్రెస్‌ పార్టీతో ఆయన రాజకీయ జీవితం మొదలైంది. అనంతరం జనతా దళ్‌లో చేరారు. ఆ తర్వాత 1998లో దినేశ్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా దినేశ్‌ త్రివేది బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఆయన బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇంకా తృణమూల్‌ పార్టీకి ఆయన రాజీనామా చేయలేదు. 

మరిన్ని వార్తలు