కరోనాపై పోరాటంలో కొత్త సవాల్‌

25 Jun, 2021 03:53 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నకిలీ వ్యాక్సిన్ల కలకలం

ప్రభుత్వానికి తలనొప్పిగా ఫేక్‌ టీకాలు

ఇది కూడా ఒక రకమైన వైరస్సే. ఊడలు విప్పిన అవినీతి వైరస్‌. అక్రమంగా డబ్బు సంపాదనకు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే స్వార్థం. కరోనాపై పోరాటంలో అవినీతి అడుగడుగునా సవాల్‌ విసురుతోంది. మాస్కులు నకిలీ, పీపీఈ కిట్లు నకిలీ, శానిటైజర్లు నకిలీ, రెమిడెసివిర్‌ నకిలీ, బ్లాక్‌ఫంగస్‌ ఇంజక్షన్లు నకిలీ.. ఇప్పుడు ఈ నకిలీల జాబితాలో వ్యాక్సిన్‌ చేరింది.

కోవిడ్‌ వ్యాక్సిన్‌ కార్యక్రమంలో ప్రపంచ రికార్డులు సృష్టిస్తున్నాం. ఒకేరోజు  88 లక్షల టీకా డోసులు ఇచ్చి ప్రపంచదేశాల దృష్టిని ఆకర్షించాం. అదే సమయంలో నకిలీ టీకాలు  ప్రభుత్వానికి తలనొప్పిగా మారాయి. ఇటీవల ముంబైలో కాందివలిలో టీకా డ్రైవ్‌ నకిలీదని తేలడంతో అందరూ షాక్‌కి గురయ్యారు. తృణమూల్‌ పార్లమెంటు సభ్యురాలు మిమి చక్రవర్తికే బురిడీ కొట్టించి నకిలీ వ్యాక్సిన్‌ ఇవ్వడం కలకలం రేగుతోంది. ముంబైలో పలుచోట్ల ప్రైవేటుగా ఏర్పాటు చేసిన వ్యాక్సిన్‌ కేంద్రాల్లో 2 వేల మందికి పైగా నకిలీ టీకా డోసులు తీసుకోవడం ఆందోళనను పెంచుతోంది.  

ఎంపీకే బురిడీ
తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మిమి చక్రవర్తిని కూడా కేటుగాళ్లు మాయ చేశారు. ఐఏఎస్‌ అధికారిగా చెప్పుకున్న ఒక వ్యక్తి ఆమెకు ఫోన్‌ చేసి కోల్‌కతా మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ట్రాన్స్‌జెండర్లు, దివ్యాంగులకు టీకా కార్యక్రమం ఉందని ముఖ్య అతిథిగా రావాల్సిందిగా ఆహ్వానించారు. ఈ శిబిరానికి హాజరైన ఆమె ప్రజల్లో వ్యాక్సిన్‌ తీసుకోవాలన్న చైతన్యాన్ని నింపడానికి తాను స్వయంగా కోవిషీల్డ్‌ టీకా తీసుకున్నారు. అయితే వ్యాక్సిన్‌ ఇచ్చిన సమయంలో ఆధార్‌ వివరాలు అడగకపోవడం, ఆ తర్వాత కోవిన్‌ నుంచి మెసేజ్‌ రాకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నకిలీ వ్యాక్సిన్‌ గుట్టు రట్టయింది. ఈ క్యాంప్‌లో 250 మంది వరకు వ్యాక్సిన్‌ తీసుకున్నట్టు సమాచారం. ఇప్పుడు వారి ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన నెలకొంది.  

నకిలీకి చైనాయే కేంద్రం  
నకిలీ టీకాలకూ చైనాయే కేంద్రంగా ఉంది. చైనా, దక్షిణాఫ్రికా, యూకేలలో ఈ నకిలీ వ్యాక్సిన్లు విచ్చలవిడిగా తయారవుతున్నాయి. సెలైన్, మినరల్‌ వాటర్‌తో ఈ వ్యాక్సిన్లు తయారు చేస్తున్నారు.  యూకేలో గత ఏడాది నవంబర్‌లో 20 మంది నకిలీ విక్రేతలు ఉంటే, ఈ ఏడాది మార్చి నాటికి 1,200 మందిపైగా విక్రేతలు ఉన్నట్టుగా ఇజ్రాయెల్‌కు చెందిన ప్రొడక్ట్‌ వల్నర్‌బులిటీ రీసెర్చ్‌ సంస్థ చేసిన అధ్యయనంలో తేలింది. ప్రభుత్వాల కళ్లు గప్పి అ మ్మేస్తున్న ఎన్నో సంస్థలపై ఇటీవల ఇంటర్‌పోల్‌ కొ రడా ఝళిపించింది. లక్షకిపైగా ఆన్‌లైన్‌ ఫార్మసీ సంస్థలను మూసివేసింది. 2 కోట్ల డాలర్ల విలువైన నకిలీ వ్యాక్సిన్‌కి సంబంధించిన వస్తువుల్ని స్వాధీనం చేసుకుంది.  

అడ్డుకట్ట ఎలా?  
ఈ నకిలీ వ్యవహారం అంతా గుట్టు చప్పుడు కాకుండా ఆన్‌లైన్‌లో జరిగిపోతూ ఉండడంతో వాటిని కనిపెట్టడం కష్టంగా మారింది. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్‌ ట్యాగ్స్, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ ద్వారా అసలేదో, నకిలీ ఏదో గుర్తించే అవకాశం ఉంది. కానీ నిరుపేద, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆన్‌లైన్‌ మోసాలకు అడ్డుకట్ట వేసే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేదు. అందుకే వ్యాక్సినేషన్‌ పంపిణీకి ఒక కేంద్రీకృత వ్యవస్థ ఏర్పాటు చేస్తే నకిలీల బెడద అరికట్టవచ్చన్న  అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నకిలీ వ్యాక్సిన్లే కాకుండా కోవిడ్‌పై పోరాటంలో భాగంగా వాడే వస్తువులైన మాస్కులు, పీపీఈ కిట్లు, శానిటైజర్లు వంటివాటిలో  నకిలీవి గుర్తించడానికి ప్రభుత్వాలే ప్రజల్లో అవగాహన పెంచాలి. వీటిని తయారు చేసే కంపెనీలు కూడా ఒరిజినల్‌ ఉత్పత్తులకు సంబం« దించిన డిజైన్లను మారుస్తూ ప్రచారం కల్పించాలి.

ప్రభుత్వ టీకా  కేంద్రాలకు వెళ్లే టీకా డోసులు వేసుకోండి. వెబ్‌సైట్లలోనూ, ఫోన్లలోనూ వచ్చే సమాచారాన్ని చూసి టీకాలు తీసుకోవద్దు. వ్యాక్సిన్‌ డిమాండ్‌కి తగ్గట్టుగా ప్రభుత్వాలు సరఫరా చేయలేకపోతున్నాయి. అందుకే నకిలీ ముఠాలు చెలరేగిపోతున్నాయి.
– డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ ఘెబ్రెయాసస్‌

మరిన్ని వార్తలు