స్టేజిపై మహిళా ఎమ్మెల్యే బుగ్గ గిల్లిన ఎంపీ

9 Mar, 2021 21:35 IST|Sakshi
మహిళా ఎమ్మెల్యే బుగ్గ గిల్లుతున్న టీఎంసీ ఎంపీ కళ్యాణ్‌ బెనర్జీ (ఫోటో కర్టెసీ: ఇండియా టుడే)

పశ్చిమ బెంగాల్‌లో కలకలం రేపుతోన్న వీడియో

కోల్‌కతా: త్వరలో పశ్చిమ బెంగాల్‌లో  అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తోన్న బీజేపీని దీదీ మమతా బెనర్జీ ఒక్కతే ధైర్యంగా ఎదుర్కొంటున్నారు. ఎన్నికల్లో తన పార్టీ తరఫున బరిలో నిలవనున్న అభ్యర్థులందరి తరఫున ఆమె ప్రచారం చేస్తూ.. పార్టీ విజయం కోసం కృషి చేస్తున్నారు. మరో పక్క టీఎంసీ నాయకులు బహిరంగంగా సిగ్గు మాలిన పనులు చేస్తూ దీదీని ఇరుకున పెడుతున్నారు. తాజాగా టీఎంసీ ఎంపీ బిత్తిరి చర్యకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. 

బీజేపీ లోక్‌సభ ఎంపీ లాకెట్‌ చట్టర్జీ తన ట్విట్టర్‌లో షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. ‘‘టీఎంసీ మహిళా సాధికారతకు నిదర్శనం’’ అనే క్యాప్షన్‌తో షేర్‌ చేసిన ఈ వీడియోలో టీఎంసీ ఎంపీ కళ్యాణ్‌ బెనర్జీ మరి కొందరు నాయకులు ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. వీరితో పాటు బాన్‌కురా మహిళా ఎమ్మెల్యే కూడా ఈ ప్రెస్‌ మీట్‌కు హాజరయ్యారు. ఇక మీడియా సమక్షంలోనే అందరూ చూస్తుండగా కళ్యాణ్‌ బెనర్జీ సదరు మహిళా ఎమ్మెల్యే బుగ్గ గిల్లాడు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే సదరు మహిళా ఎమ్మెల్యేకు టీఎంసీ ఈ సారి టికెట్‌ ఇవ్వలేదు. 

ఈ సంఘటన ఎప్పుడు జరిగింది అనే దాని గురించి ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం ఈ వీడియో రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతోంది. ఈ క్రమంలో బీజేపీ.. ‘‘టీఎంసీ నేతల నీచ బుద్ధులకు ఈ వీడియో నిదర్శనం. గద్దె దించడమే వీరికి సరైన శిక్ష’’ అంటూ విమర్శిస్తోంది. ఈ వీడియోపై టీఎంసీ ఇంతవరకు స్పందించలేదు. 

చదవండి: తప్పు చేశాను క్షమించండంటూ స్టేజీ మీదే..

మరిన్ని వార్తలు