ఓట్లు అమ్ముకుంటే మంచి నాయకులు ఎలా వస్తారు?

1 Apr, 2021 15:14 IST|Sakshi
మధురై కోర్టు (ఫైల్‌ ఫోటో)

మంచి నాయకుల్ని ఎలా ఎదురుచూడగలం

ఉచితాలతో సోమరితనం 

మదురై ధర్మాసనం అసహనం 

సాక్షి, చెన్నై: ఓటును నోటు, బిర్యానీకి, బాటిల్‌కు అమ్ముకుంటే..ఎలా మంచి నాయకుల్ని ఎదురు చూడగలమని మదురై ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది. ఉచితా పథకాలతో సోమరితనం పెరిగినట్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఎన్నికల కమిషన్‌ ముందు 20 ప్రశ్నల్ని ఉంచి, సమాధానాలు ఇవ్వాల్సిందేనని న్యాయమూర్తి హుకుం జారీ చేశారు. మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనంలో కడయనల్లూరుకు చెందిన చంద్రమోహన్‌ వాసుదేవనల్లూరు నియోజకవర్గాన్ని జనరల్‌ కేటగిరి పరిధిలోకి తీసుకొచ్చే రీతిలో ఈసీని ఆదేశించాలని కోరుతూ గతంలో ఓ పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్‌ బుధవారం న్యాయమూర్తులు కృపాకరణ్, పుహలేంది బెంచ్‌ ముందుకు వచ్చింది. ఈసందర్భంగా ఇటు ప్రజ లకు, అటు రాజకీయపక్షాలకు, ఎన్నికల యంత్రాంగానికి చురకలు అంటించే రీతిలో, అక్షింతలు వేస్తూ న్యాయమూర్తులు తీవ్రంగా స్పందించారు.  

అమ్మేసుకుంటే ఎలా.. 
నోటుకు, కానుకలకు, బిర్యానీ, మందు బాటిళ్లకు ఓట్లను అమ్మేసుకుంటే, ఎలా మంచి నాయకులు సేవల్ని అందించేందుకు వస్తారని ప్రజల్ని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. సామాజిక సంక్షేమం, పేదరిక నిర్మూలన అంటూ ప్రకటించే ఉచిత పథకాలు ప్రజల్ని సోమరి పోతులుగా మార్చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచిత పథకాల వాగ్ధానాలు ఇచ్చే పార్టీలను నిషేధించ వచ్చుగా అని ఎన్నికల కమిషన్‌ను ప్రశ్నించారు. ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో అనేక పార్టీలు ఇస్తున్న వాగ్దానాలు చూస్తుంటే, కళ్లు బైర్లు కమ్మేసుకున్నట్టుందని పేర్కొన్నారు. గృహిణిలకు నెలకు ఒకరు రూ. వెయ్యి ఇస్తామంటే, తాము రూ.1500 ఇస్తామంటూ పోటా పోటీగా హామీలను రాజకీయ పక్షాలు ఇచ్చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ చేసే వాళ్లకే తమ ఓటు అంటూ తమను తాము అవినీతి పరులుగా ప్రజలు చూపించుకుంటుండడం విచారకరంగా పేర్కొన్నారు.  

ఈసీకి 20 ప్రశ్నలు.. 
అనేక పార్టీలు ఇస్తున్న వాగ్దానాలు, చేస్తున్న ప్రకటనలు ఆచరణలో అమలు చేయలేని రీతిలో ఉన్నా యని న్యాయమూర్తులు అసహనం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు స్థానిక సమస్యలు, స్థానిక ప్రగతి, అభివృద్ధి, విద్య, వైద్య, మౌలిక సదుపాయలపై దృష్టి పెడితే చాలు అని హితవు పలికారు.   ఇటీవల తమిళనాడులో చిన్న చిన్న దుకాణాల్లోనూ ఉత్తరాది వాసులే అధికంగా పనుల్లో కనిపిస్తున్నారని పేర్కొంటూ, మున్ముందు వలసలు వచ్చిన వాళ్లు యజమానులుగా, ఇక్కడి వారు కూలీలుగా మారే పరిస్థితులు తప్పవేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. 20 ఏళ్లుగా ఉచితాలకే ప్రధాన్యత ఉంటూ వస్తున్నదని పేర్కొంటూ, ఎన్నికల కమిషన్‌ ముందు 20 ప్రశ్నల్ని న్యాయమూర్తులు ఉంచారు.

2013లో సుబ్రమణ్య బాలాజీ కేసులో ఇచ్చిన తీర్పు మేరకు ఉచిత వాగ్దానాలు, ఆచరణలో అమలు చేయలేని వాగ్దానాల క్రమబద్ధీకరణకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుందో స్పష్టం చేయాలని ప్రశ్నించారు. ఈ తీర్పును ఎన్నికల్లో ఏ మేరకు అమలు చేశారో, వాగ్దానాలు ఎన్నింటిని తిరస్కరించారా, పార్టీలు ఎలాంటి వాగ్దానాలు ఇచ్చాయో, అందులో ఏ మేరకు అమలయ్యేయో అని ప్రశ్నల వర్షం కురిపించారు. ఉచితాల పేరిట ప్రజల్ని సోమరిపోతులుగా మార్చేస్తున్న పార్టీలకు నిషేధం విధించవచ్చుగా, గెలిచిన అభ్యర్థి అధికారంలోకి వచ్చాక, ఎన్ని వాగ్దానాల్ని సక్రమంగా నెరవేర్చాడో అనే ప్రశ్నల్ని అడుగుతూ వీటన్నింటికి వివరణ ఇవ్వాలని ఈసీని ఆదేశించారు. తర్వాత విచారణను ఏప్రిల్‌ 26వ తేదీకి వాయిదా వేశారు.                 

మరిన్ని వార్తలు