పరీక్ష రాద్దామా, వద్దా..?: వాట్సాప్‌లో అభిప్రాయాల సేకరణ

4 Jun, 2021 15:11 IST|Sakshi

సాక్షి, చెన్నై: పరీక్ష రాద్దామా, వద్దా..? అని తేల్చుకునేందుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల అభిప్రాయాలను వాట్సాప్‌ ద్వారా గురువారం తమిళనాడు విద్యాశాఖ సేకరించింది. మెజారిటీ శాతం తల్లిదండ్రులు కరోనా పరిస్థితులు సద్దుమనిగిన అనంతరం పరీక్షలు నిర్వహించాలని సూచించడం గమనార్హం. కేంద్రం పరిధిలోని ప్లస్‌టూ సీబీఎస్‌ఈ పరీక్షల రద్దు చేసిన నేపథ్యంలో అన్ని వర్గాల అభిప్రాయాల మేరకు నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

గురువారం విద్యార్థుల ఫోన్‌ నెంబర్ల ఆధారంగా వారి తల్లిదండ్రుల అభిప్రాయాల్ని వాట్సాప్‌ ద్వారా సేకరించారు. మెజారిటీ శాతం తల్లిదండ్రులు, విద్యార్థులు కరోనా పరిస్థితులు పూర్తిగా సద్దుమనిగిన తర్వాత పాఠశాలల్లో లేదా ఆన్‌లైన్‌ ద్వారా పరీక్షల నిర్వహించాలని సూచించడం గమనార్హం. అలాగే విద్యా వేత్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థి సంఘాల అభిప్రాయాలు సేకరిస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నంలోపు ఈ ప్రక్రియను ముగించి సీఎం స్టాలిన్‌కు సమర్పించనున్నారు. దీనిని సమీక్షించిన అనంతరం శనివారం సీఎం ప్రకటన విడుదల చేస్తారని విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేష్‌ తెలిపారు. తమకు విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తు రెండు ముఖ్యమని ఆయన మీడియాకు వివరించారు. టెట్‌ ద్వారా ఎంపికైన టీచర్ల నియామకం గురించి పాఠశాలల రీ ఓపెనింగ్‌ సమయంలో పరిశీలిస్తామని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.  

6న టీఐఎంఈ ప్రతిభా పరీక్ష.. 
క్యాట్‌ 2021–22కు సిద్ధం అవుతున్న విద్యార్థులకు టైమ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ (టీఐఎంఈ) టాలెంట్‌ సెర్చ్‌ పేరిట జూన్‌ 6న పరీక్ష ఆన్‌లైన్‌లో నిర్వహించనుంది. ఉదయం 10, సాయంత్రం 6 గంటలకు రెండు స్లాట్లుగా పరీక్ష నిర్వహించనున్నట్టు పేర్కొంది. విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని, వివరాలకు తమ వెబ్‌ సైట్‌ను సంప్రదించాలని సంస్థ సూచించింది. 

చదవండి: వ్యాక్సిన్‌ వేసుకుంటే.. బిర్యానీ, బైకు, బంగారం.. ఎక్కడో తెలుసా?

మరిన్ని వార్తలు