‘వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఆగిపోయింది.. కోటి టీకాలు కావాలి’ 

14 Jul, 2021 15:31 IST|Sakshi

తమిళనాడుకు తక్కువ కేటాయింపులు  

వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ఆగిపోయింది 

లోటును భర్తీ చేస్తేనే లక్ష్యాన్ని సాధిస్తాం 

ప్రధాని మోదీకి సీఎం స్టాలిన్‌ ఉత్తరం 

‘రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ పూర్తిగా స్తంభించింది.. అన్ని వయసుల కేటగిరీల వారు వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూస్తున్నారు.. రాష్ట్ర అవసరాలకు తగినట్లుగా కోవిడ్‌ వ్యాక్సిన్ల కేటాయింపు లేవు.. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఈ కేటాయింపులు చాలా తక్కువ.. కేటాయింపుల్లో లోటును భర్తీ చేయండి.. ప్రత్యేకంగా కోటి వ్యాక్సిన్లను కేటాయిస్తేనే లక్ష్యాలను సాధించగలుతాం’ అని పీఎం మోదీకి ముఖ్యమంత్రి స్టాలిన్‌ మంగళవారం లేఖ రాశారు. 

సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడుకు కోటి డోసుల కరోనా వ్యాక్సిన్లను ప్రత్యేకంగా కేటాయించాల్సిందిగా కోరుతూ  ప్రధాని నరేంద్రమోదీకి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ మంగళవారం ఉత్తరం రాశారు. రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ పూర్తిగా స్తంభించడంతో ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. 18–44, 45 ఏళ్లు పైబడినవారు, 60 ఏళ్లు పైబడిన సీనియర్‌ సిటిజన్స్‌ ఇలా మూడు కేటగిరిల్లోని వారంతా వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూస్తున్నారు. వ్యాక్సిన్‌ వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలన్నీ మూతపడ్డాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్ద ‘వ్యాక్సిన్‌ వేయడం లేదు’ అనే బోర్డులు దర్శనమిస్తున్నాయి.

తొలి డోసు వేసుకుని, రెండో డోసుకు గడువు దాటిపోయినా వ్యాక్సిన్‌ ఎప్పుడు వేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. నిర్ణీత గడువులోగా రెండో డోసు వేసుకోకుంటే తొలిడోసు కూడా వృథాగా మారుతుందని వైద్య నిపుణులు సూచిస్తుండడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. రెండో డోసుకోసం వెళుతున్న ప్రజలకు సరైన సమా«ధానం కూడా కరువవడంతో ప్రభుత్వ వైద్య సిబ్బందితో ఘర్షణపడుతున్నారు.

ఈ నేపథ్యంలో సీఎం స్టాలిన్‌ ప్రధానికి ఉత్తరం రాశారు.‘తమిళనాడులో 18–44 మధ్య వయస్కులకు ఈనెల 8వ తేదీ వరకు 29,18,110 వ్యాక్సిన్లు, 45 ఏళ్లు పైబడిన వారికి 1,30,08,440 వ్యాక్సిన్లు కేటాయించాం. రాష్ట్ర అవసరాలకు తగినట్లుగా కోవిడ్‌ వ్యాక్సిన్ల కేటాయింపు లేకపోవడంతో పరిస్థితి కఠినంగా మారింది. రాష్ట్ర జనాభాకు అనుగుణంగా వ్యాక్సిన్ల కేటాయింపు లేదు. దీంతో 1000 : 302 దామాషాపై వ్యాక్సిన్‌ కేటాయించాల్సి వస్తోంది. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఈ కేటాయింపులు చాలా తక్కువ. కాబట్టి వ్యాక్సిన్‌ కేటాయింపుల్లో తమిళనాడుకు ఇప్పటి వరకు జరిగిన లోటును భర్తీ చేయండి. అంతేగాక ప్రత్యేకంగా కోటి వ్యాక్సిన్లను కేటాయించినపుడే నిర్దిష్ట కాల పరిమితిలో లక్ష్యాలను సాధించగలుగుతాం’ అని లేఖలో సీఎం వివరించారు.  

విదేశీ మందులపై పన్ను మినహాయించండి 
విదేశాల నుంచి దిగుమతి చేసుకునే జెనిటిక్‌ మందులకు జీఎస్టీ మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌కు సీఎం స్టాలిన్‌ మంగళవారం మరో ఉత్తరం రాశారు. వెన్నుముక చలనం కోల్పోయిన వ్యక్తికి జెనిటిక్‌ (డీఎన్‌ఏ) చికిత్స చేయాల్సి ఉంటుంది. ఈ విధమైన వ్యాధిగ్రస్తుడికి అందించాల్సిన మందు విలువ రూ.16 కోట్లుగా ఉంది. ఈ మందును విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంది. జెనిటిక్‌ వ్యాధుల బారిన పడేవారు రాష్ట్రంలో ఏడాదికి  90 నుంచి 100 మంది వరకు ఉంటున్నారు. ఈ వ్యాధి నుంచి బయటపడేందుకు రోగులు భారీగా ఎదరవుతున్న ఖర్చులు భరించలేక పోతున్నారు. ప్రజలకు ప్రాణాలుపోయగల ఈ మందుల దిగుమతిపై విధించే కస్టమ్స్‌ సుంకంతోపాటు జీఎస్టీని కూడా కేంద్రం మినహాయించాలని ముఖ్యమంత్రి స్టాలిన్‌ విజ్ఞప్తి చేశారు.  

మరిన్ని వార్తలు