కారం తింటే కరోనా రాదయ్యా: సంచారజాతి ప్రజలు

16 Apr, 2022 06:24 IST|Sakshi

సరదాగా ముచ్చటించిన సీఎం స్టాలిన్‌ 

చెన్నై శివార్లలోని వారి నివాసాలకు వెళ్లిన సీఎం

సంక్షేమ పథకాల పంపిణీ

సాక్షి, చెన్నై: నిత్యం మంత్రులు, ఉన్నతాధికారులతో బిజీబిజీగా గడిపే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ శనివారం ప్రత్యేకంగా గడిపారు. చెన్నై శివార్లలోని సంచారజాతుల నివాసాలకు వెళ్లి సరదా ముచ్చటించారు. వారి పిల్లాపాపలతో ముచ్చట్లాడి, స్వయంగా ఇడ్లీ తినిపించి అందరినీ ఆశ్చర్య పరిచారు. ఆవడి సమీపంలోని తిరుముల్లవాయల్‌ పరిసరాల్లో నివసించే సంచారజాతుల నివాసాలను సీఎం స్టాలిన్‌ శుక్రవారం సందర్శించారు. వీరు పూసలతో హారాలు, గాజులు తయారు చేసే చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నారు. 

కారం తింటే కరోనా రాదయ్యా..
కొద్దిసేపు సీఎం స్టాలిన్‌ అక్కడి ప్రజలతో మాట్లాడి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి ఆవడి బస్‌స్టేషన్‌ సమీపంలోని సంచారజాతుల ఇళ్లకు వెళ్లి సంభాషించారు. ఓ ఇంట్లో ఇడ్లీ తిని ఒక బాలికకు తినిపించారు. ఇడ్లీతో పాటు పెట్టిన నాటుకోడి కూర కారంగా ఉందే అని  ముఖ్యమంత్రి స్టాలిన్‌ ప్రశ్నించారు. కారం తీంటే కరోనా రాదని మా నమ్మకం అయ్యా అంటూ ఒక మహిళ బదులిచ్చింది.

అలాగైతే నేనూ కారం ఎక్కువగా తింటాను అంటూ సీఎం స్టాలిన్‌ నవ్వుతూ బదులిచ్చారు. ఆ తరువాత అక్కడి ప్రజలకు సీఎం ఆరోగ్య బీమా పథకం కార్డు, రేషన్‌కార్డులు, సామాజిక రక్షణ పథకం కింద ఆర్థిక సాయం, ఇళ్లపట్టాలను పంపిణీ చేశారు. సంచార జాతి ప్రజలకు అందుతున్న మౌలిక సదుపాయాల గురించి ఆరా తీశారు. సంచారజాతుల వారు తయారుచేసిన వివిధ పూసల హారాన్ని సీఎం స్టాలిన్‌ మెడలో వేసి సత్కరించారు. 

చదవండి: (రష్యా నుంచి ఎస్‌–400 మిస్సైల్‌ సిస్టమ్‌ రాక)

మరిన్ని వార్తలు