దినేశ్‌ వెడ్స్‌ జనగనందిని.. ఇన్‌స్టాలో పరిచయం ఆపై పెళ్లి పీటలపైకి! మెటావర్స్‌ ద్వారా రిసెప్షన్‌.. దేశంలోని తొలిసారి..

17 Jan, 2022 16:17 IST|Sakshi

Metaverse Reception In Tamil Nadu Soon: వెరైటీగా ఏం చేసినా చాలు.. వార్తలు, సోషల్‌ మీడియా ద్వారా జనాలకు చేరొచ్చని అనుకుంటున్నారు కొందరు. ఈ క్రమంలో విచిత్రమైన పోకడలకు పోతుంటారు. అయితే తమిళనాడులో ఓ యువకుడు మాత్రం చాలా ‘టెక్నికల్‌’గా ఆలోచించాడు. తద్వారా దేశంలోనే అరుదైన ఫీట్‌ సాధించబోతున్నాడు. 


మెటావర్స్‌ వెడ్డింగ్‌ రిసెప్షన్‌ నిర్వహించడం ద్వారా అరుదైన ఫీట్‌ సాధించబోతోంది ఈ కాబోయే జంట.  తమిళనాడు శివలింగపురం గ్రామానికి చెందిన దినేష్‌ ఎస్‌పీ, జనగనందిని రామస్వామి ఫిబ్రవరి 6న వివాహం చేసుకోబోతున్నారు. ప్రస్తుతం అక్కడున్న ఆంక్షల వల్ల కొద్ది మంది బంధువుల సమక్షంలో ఒక్కటి కాబోతున్నారు. అయితే రిసెప్షన్‌ మాత్రం వర్చువల్‌గా నిర్వహించబోతున్నారు. అదీ మెటావర్స్‌ ద్వారా.  ఇది గనుక సక్సెస్‌ అయితే భారత్‌లో ఈ తరహా ప్రయోగం చేసిన మొదటి జంట వీళ్లదే అవుతుంది.  


 
ఇన్‌స్టా పరిచయం
దినేశ్‌ ఐఐటీ మద్రాస్‌లో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌గా పని చేస్తున్నాడు. జనగనందిని సాప్ట్‌వేర్‌ డెవలపర్‌గా పని చేస్తోంది. ఈ ఇద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయం అయ్యారు. పెద్దలను వివాహానికి ఒప్పించారు. బ్లాక్‌చెయిన్‌, క్రిప్టోకరెన్సీ మీద విపరీతమైన ఆసక్తి ఉన్న దినేశ్‌.. మెటావర్స్‌లో వెడ్డింగ్‌ రిసెప్షన్‌ నిర్వహించాలన్న ఆలోచనను ఫియాన్సీతో పంచుకోగా.. సంతోషంగా అంగీకరించిందట. ఇక భారత్‌లో ‘ఫస్ట్‌ మెటావర్స్‌ మ్యారేజ్‌’ తమదేనంటూ దినేష్‌ ఒక ట్వీట్‌ కూడా చేశాడు. హ్యారీ పోటర్‌ యూనివర్స్‌ థీమ్‌తో ఈ రిసెప్షన్‌ను నిర్వహించబోతున్నారు. సుమారు గంటపాటు ఈ రిసెప్షన్‌ జరగనుండగా.. ల్యాప్‌ ట్యాప్‌ ద్వారా ఆ జంట, అతిథులు రిసెప్షన్‌లో పాల్గొంటారు. అంతేకాదు వర్చువల్‌ రిసెప్షన్‌ ద్వారానే ఆశీర్వదించడంతో పాటు గిఫ్ట్‌లు(గిఫ్ట్‌ వౌచర్ల ట్రాన్స్‌ఫర్‌, గూగుల్‌పే, క్రిప్టోలు) ఇవ్వొచ్చు. అయితే భోజనాల సంగతి మాత్రం స్పష్టత ఇవ్వలేదు!. కిందటి ఏడాది అమెరికాలో ఇదే తరహాలో ఏకంగా ఒక వివాహమే జరిగింది.

మెటావర్స్‌ అంటే వర్చువల్‌ రియాలిటీ ప్రపంచం.  అసలైన రూపాలతో కాకుండా.. డిజిటల్‌ అవతార్‌లతో ఇంటెరాక్ట్‌ కావడం.  అగుమెంటెడ్‌ రియాలిటీ, బ్లాక్‌చెయిన్‌, వర్చువల్‌ రియాలిటీ.. సాంకేతికతల కలయికగా పేర్కొనవచ్చు. విష్నేష్‌సెల్వరాజ్‌ టీం ‘తడ్రివర్స్‌’ అనే స్టార్టప్‌ ద్వారా ఈ మెటావర్స్‌ రిసెప్షన్‌ను నిర్వహించనుంది.

మరిన్ని వార్తలు