మారియప్పన్‌కు సర్కారీ ఉద్యోగం: సీఎం స్టాలిన్‌

4 Nov, 2021 08:07 IST|Sakshi
మారియప్పన్‌కు నియామక పత్రం అందజేస్తున్న సీఎం స్టాలిన్‌  

సాక్షి, చెన్నై: పారా ఒలింపిక్స్‌ పతక విజేత మారియప్పన్‌ తంగవేల్‌కు ప్రభుత్వ ఉద్యోగం దక్కింది. ఈ మేరకు నియామక పత్రాన్ని సీఎం ఎంకే స్టాలిన్‌ బుధవారం అందజేశారు. సేలం జిల్లా పెరియవడకం పట్టి గ్రామానికి చెందిన మారియప్పన్‌ తంగవేలు రియో పారా ఒలింపిక్స్‌ హైజంప్‌ విభాగంలో బంగారు పతకం దక్కించుకుని తమిళనాట హీరోగా అవతరించిన విషయం తెలిసిందే. ఇటీవల టోక్యో పారా ఒలింపిక్స్‌లోనూ బంగారం ప్రయత్నం చేసి రజతం దక్కించుకున్నారు. పారా ఒలింపిక్స్‌లో రెండు సార్లు, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో అనేక పతకాలు దక్కించుకున్నా ప్రభుత్వ ఉద్యోగం దక్కలేదని నెల క్రితం మారియప్పన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇందుకు సీఎం స్టాలిన్‌ స్పందించారు. కరూర్‌లోని కాగితం పరిశ్రమ విక్రయ విభాగం అసిస్టెంట్‌ మేనేజర్‌గా నియమించారు. ఇందుకు తగ్గ నియామక ఉత్తర్వులను బుధవారం సచివాలయంలో మారియప్పన్‌కు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీ కనిమొళి, పలువురు మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మారియప్పన్‌ మీడియాతో మాట్లాడు తూ.. తనకు ఉద్యోగం లభించడం సంతోషంగా ఉందన్నారు. తమిళనాడులో పారా క్రీడా అసోసియేషన్‌కు గుర్తింపు కల్పించాలని, తద్వారా తన లాంటి వారు ఎందరో రాణించేందుకు అవకాశం ఉంటుందన్నారు. 

చదవండి: (వినీషా పవర్‌ ఫుల్‌ స్పీచ్‌ : మీ తీరు చూస్తోంటే.. కోపం వస్తోంది!)

ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కు రూ. 196 కోట్లు 
కరోనా సమయంలో సేవలందించిన వైద్యఆరోగ్య సిబ్బందికి ప్రోత్సాహకంగా రూ. 196 కోట్లను ప్రభు త్వం ప్రకటించింది. 24 వేల మంది వైద్య సిబ్బంది, 26 వేల మంది నర్సులు, 6 వేల మంది హెల్త్‌ అసిస్టెంట్స్, 8 వేల మంది గ్రామ ఆరోగ్య సిబ్బంది సహా మొత్తం 1.05 లక్షల మందికి ప్రోత్సాహకం ప్రకటించారు. సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో 11 మందికి సీఎం స్టాలిన్‌ ప్రోత్సాహక నగ దు అందజేశారు. అలాగే రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ నేతృత్వంలో రూ. 170 కోట్లతో 121 పాఠశాలల్లో నిర్మించిన అదనపు తరగతులు, గ్రంథాలయాలు, పరిశోధక విభాగాల భవనాలను సీఎం ప్రారంభించారు. మంత్రులు ఎం.సుబ్రమణియన్, అన్బిల్‌ మ హేశ్, ఆరోగ్య కార్యదర్శి రాధాకృష్ణన్‌ పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు