Tamilnadu: పోలీసులకు వీక్లీ ఆఫ్‌.. ఉత్తర్వులు జారీ 

4 Nov, 2021 08:27 IST|Sakshi
సీఎం నుంచి ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ అందుకుంటున్న డీజీపీ శైలేంద్రబాబు

కంట్రోల్‌ రూమ్‌కు ఐఎస్‌ఓ గుర్తింపు 

సాక్షి, చెన్నై: రాష్ట్ర పోలీసులకు వీక్లీ ఆఫ్‌ అమల్లోకి వచ్చింది. ఇందుకు తగ్గ ఉత్తర్వులు బుధవారం జారీ అయ్యాయి. రాష్ట్రంలో లక్ష మంది మేరకు పోలీసులు వివిధ విభాగాల్లో పనిచేస్తున్నారు. పని ఒత్తిడితో కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీంతో పోలీసులకు ఆయా జిల్లాల్లో వారంలో ఏదో ఒక రోజు సెలవుతో పాటు, వివాహ, బర్తడే రోజుల్లో అనధికారింగా సెలవు ఇచ్చేవారు. అయితే, ఇది ఆచరణలో విఫలం కాక తప్పలేదు. ఈ పరిస్థితుల్లో పోలీసులకు వారంలో ఓ రోజు వీక్లీఆఫ్‌ అనివార్యంగా సీఎం స్టాలిన్‌ భావించారు. 

చదవండి: (మారియప్పన్‌కు సర్కారీ ఉద్యోగం: సీఎం స్టాలిన్‌)

విధులను పక్కన పెట్టి వారంలో ఓ రోజుకు కుటుంబంతో గడిపేందుకు వీలుగా వీక్లీ ఆఫ్‌ అమలుకు సిద్ధం అయ్యారు. ఫస్ట్, సెకండ్‌ గ్రేడ్‌ పోలీసులు, హెడ్‌ కానిస్టేబుళ్లకు వారంలో ఓ రోజు వీక్లీ ఆఫ్‌ తీసుకునే అవకాశం కల్పించారు. సిఫ్ట్‌ పద్ధతిలో ఆయా స్టేషన్లలో సిబ్బంది వీక్లీ ఆఫ్‌ తీసుకోవచ్చు. దీనిపై పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.  

ఐఎస్‌ఓ గుర్తింపు 
చెన్నై డీజీపీ కార్యాలయం ఆవరణలో ప్రజల సేవ నిమిత్తం ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చే ఫిర్యాదులు ఆయా జిల్లాలకు పంపించి, పరిష్కారం దిశగా చర్యలు చేపడుతున్నారు.  ఈ ఏడాదిలో 1.12 కోట్ల ఫిర్యాదులు రావడం, వాటికి పరిష్కారం చూపడం  రికార్డుకు ఎక్కింది. బ్రిటీష్‌ స్టాండర్డ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఈ కంట్రోల్‌ రూమ్‌కు ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ను అందజేసింది. ఈ సర్టిఫికెట్‌ను బుధవారం సీఎం స్టాలిన్‌ చేతుల మీదుగా డీజీపీ శైలేంద్ర బాబు, హోం శాఖకార్యదర్శి ప్రభాకర్‌ అందుకున్నారు.   

మరిన్ని వార్తలు