Shawarma Ban: మనది కాని వంటకం.. విషంతో సమానమే!.. షవర్మా తినొద్దంటున్న ఆరోగ్య మంత్రి

9 May, 2022 16:26 IST|Sakshi

మతం, కులం, ప్రాంతం, భాష, చివరకు తినే తిండి.. ఇలా రాజకీయానికి ఏదీ అతీతం కాదని నిరూపిస్తున్నారు మన నేతలు. ఇదిలా ఉండగా.. ఇక్కడో మంత్రిగారు మాత్రం ‘షవర్మా’ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ యువతి పాడైన షెవర్మా తిని ప్రాణాలు పొగొట్టుకోవడమే అందుకు కారణం.

మిడిల్‌ ఈస్ట్‌ దేశాల స్ట్రీట్‌ ఫుడ్‌ అయిన షవర్మాను.. పాశ్చాత్య దేశాల వంటకంగా సర్టిఫై చేశారు తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి మా సుబ్రమణియన్‌. అంతేకాదు అసలు భారతీయ వంటకంలో భాగం కానీ షవర్మా ఎట్టిపరిస్థితుల్లో తీసుకూడదంటూ జనాలను కోరుతున్నాడాయన. 

ఆరోగ్యాన్ని దెబ్బ తీసే ఆహారపు అలవాట్లకు దూరంగా ఉండాలంటూ మాట్లాడిన ఆయన.. షవర్మాను తినొద్దంటూ ప్రజలకు సలహా ఇచ్చారు. ‘‘షవర్మా మన వంటకం కాదు. అది పాశ్చాత్య దేశాల మెనూలోని ఆహారం. అక్కడి వాతావరణానికి తగ్గట్లుగానే అది ఉంటుంది. పాడైపోదు కూడా. ఒకవేళ మాంసానికి సంబంధించిన ఏ ఆహారాన్ని భద్రపర్చాలంటే ఫ్రీజర్‌లలో ఉంచాలి. సరిగ్గా మెయింటెన్‌ చేయకపోతే షవర్మా పాడైపోతుంది. తిన్నవాళ్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపెడుతుంద’’ని వ్యాఖ్యానించారాయన.  
దేశంలో షవర్మాను అందించే ఏ ఫుడ్‌ కోర్టుల్లోనూ స్టోరేజ్‌ సౌకర్యాలు సరిగా లేవని, దుమ్ము ధూళితో రోడ్డు బయటే ఉంచుతున్నారని.. తద్వారా యువతను, ఆహార ప్రియులను ఆకర్షిస్తున్నారని వ్యాఖ్యలు చేశారాయన. మన వాతావరణానికి తగ్గట్లుగా ఉండే ఆహారాన్ని తీసుకుంటేనే మనకు మంచిది. మనది కానిది.. విషంతోనే సమానం అంటూ ఆదివారం కరోనా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో పాల్గొన్న మా సుబ్రమణియన్‌ వ్యాఖ్యానించారు. విశేషం ఏంటంటే.. చాలామంది సోషల్‌ మీడియాలో సుబ్రమణియన్‌ ట్రోల్‌ చేస్తున్నప్పటికీ.. కొంత మంది మాత్రం ఆయన వ్యాఖ్యలతోనే ఏకీభవిస్తున్నారు.

కేరళ కాసరగోడ్‌ జిల్లాలోని ఓ జ్యూస్‌ సెంటర్‌లో.. మే 1వ తేదీన ఓ ఫుడ్‌ కోర్టులో పాడైపోయిన షవర్మా తిని 59 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీళ్లలో దేవానంద అనే అమ్మాయి మృతి చెందింది కూడా. ఈ ఘటన నేపథ్యంలోనే తమిళనాడు మంత్రి పైవ్యాఖ్యలు చేశారు. ఇక ఘటనలో.. ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు సాల్మోనెల్లా, షిగెల్లాను ఆ సెంటర్‌లోని షవర్మా శాంపిల్స్‌లో గుర్తించినట్లు కేరళ ఆరోగ్య విభాగం ఒక నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది.

సంబంధిత వార్త: ఐదు నెలల క్రితం తండ్రి! ఇప్పుడేమో కుళ్లిన షవర్మా తిని..

మరిన్ని వార్తలు