‘నీవు చనిపోయావు’  నామినేషన్‌ ఎలా వేస్తావు?

4 Feb, 2022 09:15 IST|Sakshi
అన్నాడీఎంకే అభ్యర్థిగా అమృతవల్లి

నగరపాలక ఎన్నికల్లో డబ్బేడబ్బు..

నూటికి రూ.10 లెక్కన వడ్డీ వసూలు చేస్తున్న రుణదాతలు 

అయినా తగ్గేదేలే అంటున్న అభ్యర్థులు

రంగంలోకి బడా ఫైనాన్షియర్లు 

అభ్యర్థుల ఎన్నికల ఖర్చు రూ.7వేల కోట్లుగా అంచనా 

నేటితో నామినేషన్లకు తెర 

లాభనష్టాలతో పనిలేదు.. అప్పులై పోతామనే భయంలేదు.. గెలుపుకోసం ఎందాకైనా వెళ్తాం.. అన్నట్లుగా అభ్యర్థులు జోరు చూపిస్తున్నారు. నగరపాలక ఎన్నికల బరిలో విజయలక్ష్మిని వరించడమే తమ ధ్యేయమన్నట్లు ముందుకుసాగుతున్నారు. పైగా వడ్డీ నూటికి పది రూపాయౖలñ నా..∙పర్వలేదంటూ ప్రత్యర్థులకు సవాల్‌ విసురుతున్నారు.

సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘‘కష్టపడి సీటు దక్కించుకున్నా.. తాడోపేడో.. అటోఇటో.. ఏదో ఒకటి తేలిపోవాల్సిందే.. ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు.. గెలుపుకోసం ఎంత వరకైనా పోరాడుతా.. ఎంత డబ్బయినా పెడతా..’’ ఇదీ ఎన్నికలపై ఓ పార్టీ అభ్యర్థి మనోగతం.. అవును.. నగరపాలక ఎన్నికల్లో బరిలో నిలిచిన అభ్యర్థులు గెలుపుకోసం సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. దీంతో ఇదే అదనుగా అప్పులుస్తాం రండి అంటూ జాతీయస్థాయి రుణదాతలు రాష్ట్రంలో వాలిపోతున్నారు. 

ఫైనాన్షియర్ల చుట్టూ.. 
రాష్ట్రంలో 21 కార్పొరేషన్లు, 138 మునిసిపాలిటీలు, 490 పట్టణ పంచాయతీల్లోని 12,838 వార్డులకు ఈనెల 19వ తేదీన ఎన్నికల పోలింగ్‌ జరగనుంది. సీటు దక్కించుకునేందుకు ఆయా పార్టీల అధిష్టానికి భారీగా ముట్టజెప్పిన అభ్యర్థులు ప్రస్తుతం.. ప్రచారపర్వంలో దిగిపోయారు. మరోవైపు ఖర్చుల కోసం ఫైనాన్షియర్ల చుట్టూ తిరుగుతున్నారు.

ఇక సీటు ఇచ్చేశాం.. విజయం సాధించడం మీ వంతు అని పార్టీల పెద్దలు హుకుం జారీ చేస్తుండడంతో అభ్యర్థులు శాయశక్తులా విజయం కోసం పోరాడుతున్నారు. తిరునెల్వేలి, తూత్తుకూడి జిల్లాల నుంచి పలువురు ఫైనాన్షియర్లు కందువడ్డీపై అప్పులిచ్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా సంచరిస్తున్నారు. భూమి, ఇంటి స్థలం, వాహనం ఇలా ఏదైనా తాకట్టుపెట్టుకుని డబ్బులిస్తామంటూ ప్రచారం చేస్తున్నారు. డిమాంబ్‌ను బట్టి నూటికి 10 రూపాయల వరకు వడ్డీ వసూలు చేస్తున్నారు. 

చెన్నైలోనే రూ. వెయ్యికోట్లకు పైగా? 
రుణాల వ్యవహారంపై ఒక ఫైనాన్షియర్‌ మాట్లాడుతూ, చెన్నైలో 200 వార్డులున్నాయి. ఒక్కో అభ్యర్థి రూ.5 కోట్లు ఖర్చుపెట్టేందుకు సిద్ధపడుతున్నారని తెలిపారు. దీంతో కేవలం చెన్నై కార్పొరేషన్‌లోనే రూ.1000 కోట్లు ఖర్చయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా లెక్కకడితే మొత్తం రూ.7వేల కోట్లు వెచ్చించే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

అభ్యర్థుల ఎన్నికల అవసరాలకు ఎన్నికోట్ల రూపాయలు కావాలన్నా ఢిల్లీ, ముంబయి, అహ్మదాబాద్, లక్నో, కోల్‌కత్తా, బెంగళూరు, హైదరాబాద్, తిరువనంతపురం తదితర మహానగరాల నుంచి 24 గంటల్లో అప్పు ఇస్తామంటూ (మార్వాడీలు, రానా నెట్‌వర్క్, శర్మ నెట్‌వర్క్, సురాణా నెట్‌వర్క్‌ అనే పేర్లతో) రుణదాతలు   ముందుకొస్తున్నట్లు సమాచారం.  

నామినేషన్ల జోరు 
ఈనెల 4వ తేదీ సాయంత్రం 5 గంటలతో నామినేషన్ల గడువు ముగుస్తుండగా అన్నిపార్టీల అభ్యర్థులు ఎన్నికల కార్యాలయాల వద్ద గురువారం క్యూకట్టారు. పెద్దసంఖ్యలో తరలివచ్చి నామినేషన్లను సమర్పించారు. దాదాపుగా అన్నిచోట్లా ప్రధాన ప్రత్యర్థులు ఒకేసారి రావడంతో ఎన్నికల అధికారులకు దిక్కుతోచలేదు. గత నెల 28వ తేదీన నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా బుధవారం వరకు 10,153 మంది నామినేషన్లు వేశారు.  

చిన్నమ్మ పెద్ద మనసు 
ఇక అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్నాడీఎంకేపై కయ్యానికి కాలుదువ్విన చిన్నమ్మ శశికళ ప్రస్తుతానికి పెద్దమనసు చేసుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నాడీఎంకేకు ఆమె మద్దతు పలికారు. అన్నాదురై 53వ వర్ధంతి సందర్భంగా గురువారం చెన్నై టీనగర్‌లోని ఆమె నివాసంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, జయలలిత బాటలో నడిచేవారు ఎవరైనా సరే విజయం సాధించాలని అన్నారు.

ఎంజీ రామచంద్రన్, జయలలిత ఆశీస్సులతో కార్పొరేషన్, మునిసిపాలిటీ, పట్టణ పంచాయతీ ఎన్నికల్లో అన్నాడీఎంకే ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అన్నాడీఎంకే త్వరలోనే తన చేతుల్లోకి వస్తుంది, స్థానిక సంస్థల ఎన్నికలు ముగియగానే ప్రజల్లోకి వస్తానని, జిల్లాలవారీగా పర్యటిస్తానని ఆమె స్పష్టం చేశారు. 

తిరువళ్లూరు: జిల్లాలో ఇంత వరకు స్తబ్దుగా ఉన్న నామినేషన్ల ప్రక్రియ గురువారం ఊపందుకుంది. తిరుమళిసైలో డీఎంకే నేతలు పెద్దఎత్తున నామినేషన్‌లు దాఖలు చేశారు. తిరువళ్లూరు, ఆవడి, తిరునిండ్రవూర్, పూందమల్లిలోనూ ఎన్నికల కోలాహలం నెలకొంది.  

వేలూరు: వేలూరు, తిరుపత్తూరు, రాణిపేట జిల్లాలో గురువారం పోటాపోటీగా నామినేషన్లు దాఖలయ్యాయి. వేలూరు కార్పొరేషన్‌లో మొత్తం 60 వార్డులుండగా గురువారం సాయంత్రం నాటికి సుమారు 80 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు.  

పలుచోట్ల నగదు స్వాధీనం
►  తిరుచ్చిరాపల్లి, తంజావూరు, పుదుక్కోట్టైలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ గురువారం నిర్వహించిన తనిఖీల్లో రూ.58.35 లక్షలను అధికారులు సీజ్‌ చేశారు. 
►  చెన్నైలో బుధవారం వరకు రూ.1.26 కోట్ల విలువైన బహుమతులు, రూ.5.59  లక్షల నగదును  స్వాధీనం చేసుకున్నారు. 
► కోయంబత్తూరులో అన్నాడీఎంకే ప్రముఖుడు ఉలగనాథన్‌ (42) ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ప్రత్యేక తహసీల్దారు కల్పన  తనిఖీ చేసి రూ.3 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.  
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లను డబ్బుతో కొనుగోలు చేసి గెలుపొందాలని అన్నాడీఎంకే, డీఎంకే నేతలు భావిస్తున్నారని ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ విమర్శించారు. 

ప్రాణం తీసిన నిరాశ  
ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం దక్కలేదనే నిరాశ ఓవ్యక్తి ప్రాణాలను బలిగొంది. ఈరోడ్‌ జిల్లా గోపీ సమీపం వానిపుత్తూరు పట్టణ పంచాయతీకి చెందిన రామన్‌ (53), మహేశ్వరి (49) దంపతులు. గతంలో నాలుగుసార్లు జరిగిన పట్టణ పంచాయతీ ఎన్నికల్లో 9వ వార్డు నుంచి రామన్‌ రెండుసార్లు, మహేశ్వరి రెండుసార్లు అన్నాడీఎంకే సీటుపై గెలుపొందారు.

ప్రస్తుత ఎన్నికల్లో సైతం అదే వార్డు నుంచి పోటీచేసేందుకు తనకు లేదా భార్యకు అవకాశం దక్కుతుందనే నమ్మకంతో పార్టీ ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నాడు. రెండురోజుల క్రితం అన్నాడీఎంకే అభ్యర్థుల జాబితా విడుదలకాగా దంపతుల ఇద్దరి పేర్లూ అందులో లేవు. పార్టీ కోసం 40 ఏళ్లు పాటు పడినా శ్రమ వృథాగా మారిందని భార్య వద్ద తీవ్రంగా వాపోయిన రామన్‌ గురువారం ఉదయం స్పృహతప్పి పడిపోయి ప్రాణాలు విడిచాడు.

అన్నాడీఎంకే అభ్యర్థికి చేదు అనుభవం
సాక్షి ప్రతినిధి, చెన్నై : ‘ ఓటర్ల జాబితాలో నీవు చనిపోయినట్లు ఉంది.. నామినేషన్‌ ఎలా దాఖలు చేస్తావు...’ అంటూ అధికారులు ప్రశ్నించడంతో అన్నాడీఎంకే మహిళా అభ్యర్థి నిర్ఘాంతపోయారు. వివరాలు.. నాగపట్టిన మునిసిపాలిటిలో 4వ వార్డు నుంచి అన్నాడీఎంకే అభ్యర్థిగా అమృతవల్లి (33) నామినేషన్‌ దాఖలు చేసేందుకు ఎన్నికల కార్యాలయానికి వెళ్లారు.

పత్రాల తనిఖీలో భాగంగా ఓటర్ల జాబితాను తెరిచిచూస్తే ఆమె పేరు లేదు. ఇదేం చోద్యమని ఆమె ప్రశ్నించగా, మీరు చనిపోయినందున పేరు తొలగించారని అధికారులు బదులిచ్చారు. అభ్యర్థుగా తన పేరు ఖరారైనప్పుడు పేరు ఉందని.., నామినేషన్‌ వేసేటప్పుడు మాత్రం లేకపోవడం, పైగా చనిపోయిన వారి జాబితాలో పేరు చేర్చడం  కుట్రే నని ఆమె అధికారులపై ఆమె మండిపడ్డారు.

మరిన్ని వార్తలు