Lottery: లాటరీ తెచ్చిన అదృష్టం.. రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ ఉచితంగా

3 Aug, 2021 09:22 IST|Sakshi

లాటరీలో రూ.16 కోట్ల ఔషధం ఉచితంగా

అమెరికాకు చెందిన సంస్థ ద్వారా జోల్‌గెన్‌స్మా ఇంజక్షన్‌

సాక్షి, ముంబై: వేల మంది చిన్నారుల్లో ఒకరికి వచ్చే అరుదైన జన్యుపరమైన రుగ్మతతో ఎస్‌ఎంఏ (స్పైనల్ మస్క్యులర్ అట్రాఫీ) తో బాధపడుతున్న చిన్నారికి అనుకోని అదృష్టం కలిసి వచ్చింది. రానున్న రెండో పుట్టిన రోజు సందర్భంగా ఆ పసిబిడ్డకు పునర్జన్మ లభించింది. ఈ వ్యాధి చికిత్సకు అవసరమైన 16 కోట్ల ఇంజెక్షన్ ఉచితంగా లభించడంతో  చిన్నారి తల్లిదండ్రులు  సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  అదీ అమెరికా సంస్థనుంచి ఈ అవకాశాన్ని దక్కించుకున్న ఇండియాలో తొలి చిన్నారిగా నిలిచాడని పేర్కొన్నారు. 

వివరాలను పరిశీలిస్తే..మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందిన శివరాజ్ దావరే ఎస్‌ఎంఏ బారిన పడ్డాడు. ప్రాథమిక  నిర్ధారణ అనంతరం శివరాజన్‌ ప్రాణాలను కాపాడటానికి ‘జోల్‌గెన్‌స్మా’ (జీన్‌ రీప్లేస్‌మెంట్‌ థెరపీ) ఇంజెక్షన్  అవసరమని  ముంబైలోని హిందూజా ఆసుపత్రికి న్యూరాలజిస్ట్ డాక్టర్ బ్రజేష్ ఉదాని  తేల్చి చెప్పారు. ఈ అరుదైన వ్యాధి చికిత్సలో కీలకమైన, అతి ఖరీదైన ఇంజెక్షన్ ఎలా సాధించాలో తెలియక మధ్యతరగతి నేపథ్యం నుండి వచ్చిన శివరాజ్ తండ్రి విశాల్, తల్లి కిరణ్‌ తీవ్ర ఆవేదన చెందారు.

ఈ  క్రమంలో క్లినికల్ ట్రయల్స్ నిమిత్తం అమెరికాకు చెందిన  సంస్థ లాటరీ ద్వారా ఈ ఇంజెక్షన్‌ను ఉచితంగా ఇస్తుందని, అందుకు దరఖాస్తు చేసుకోవాలని డాక్టర్ ఉదాని సూచించారు. ఉదాని సలహా మేరకు  విశాల్‌ ఉచిత ఇంజక్షన్‌కోసం ప్రయత్నించారు. అదృష్టవశాత్తూ  డిసెంబర్ 25, 2020 న  శివరాజ్ ఇంజెక్షన్ పొందడానికి లక్కీ డ్రాలో ఎంపికయ్యాడు. ఫలితంగా ఈ ఏడాది జనవరి 19 న, శివరాజ్‌కు హిందూజా ఆసుపత్రిలో ఇంజక్షన్‌ ఇచ్చారు. 

వైద్యుల  ప్రకారం ఎస్‌ఎంఏ అనేది జన్యుపరమైన వ్యాధి.  ప్రతి 10వేల మందిలో  ఒకరు ఈ వ్యాధితో పడుతున్నారు. ఈ జన్యు లోపం  పిల్లల కదలికలను నిరోధిస్తుంది. కండరాలు పని తీరును, మెదడు కణాలను ప్రభావితం చేస్తుంది. ఇది క్రమంగా పిల్లల మరణానికి దారితీస్తుంది. ప్రస్తుతం దీనికి అందుబాటులో ఉన్న చికిత్స ప్రపంచంలోనే అతి ఖరీదైన జోల్జెన్‌స్మా ఇంజెక్షన్‌ మాత్రమే. అదీ రెండేళ్లలోపు ఈ చికిత్స అందించాలి. భారత్‌లో దొరకని ఆ ఇంజెక్షన్‌ను అమెరికా నుంచి మాత్రమే తెప్పించాలి. ఇందుకు సుమారు 16 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుంది.

మరిన్ని వార్తలు