దిశను అందుకే అరెస్టు చేశారు: విన్సెంట్‌

16 Feb, 2021 08:25 IST|Sakshi

దిశ రవి అరెస్టుపై స్పందించిన ఆమె స్నేహితుడు

న్యూఢిల్లీ/బెంగళూరు:  ‘‘దిశ వాళ్లకు సాఫ్ట్‌ టార్గెట్‌. తను ఒక పోస్టర్‌ గర్ల్‌ లాంటిది. కాబట్టి తనను అరెస్టు చేస్తే మిగతా వాళ్లు గొంతెత్తాలంటే కాస్త వెనకడుగు వేస్తారు కదా. అందుకే ఇలా చేశారు’’ అని బెంగళూరుకు చెందిన యువ పర్యావరణవేత్త దిశ రవి స్నేహితుడు వినీత్‌ విన్సెంట్‌ అన్నారు. మ్యుజీషియన్‌గా పనిచేస్తున్న ఆయన, తన ఫ్రెండ్‌ను అరెస్టు చేయడం తనకు పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదని పేర్కొన్నారు. కాగా నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన నిరసనలో భాగంగా, ఢిల్లీలో జనవరి 26న జరిగిన ఆందోళన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో స్వీడిష్‌ యువకెరటం గ్రెటా థంబర్గ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన ఓ టూల్‌కిట్‌ వివాదానికి  దారి తీసింది. 

ఈ అంశంపై దృష్టి సారించిన ఢిల్లీ పోలీసులు దిశ రవి, శాంతను ములుక్‌, నికితా జాకబ్‌ అనే ముగ్గురు యువతులపై అనుమానాలు వ్యక్తం చేశారు. గ్రెటా షేర్‌ చేసిన టూల్‌ను ఎడిట్‌ చేసి హింసకు ప్రేరేపించారన్న ఆరోపణలతో దిశ రవి, నికితను అరెస్టు చేశారు. శాంతను కోసం గాలిస్తున్నారు. వీరి అరెస్టు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన దిశ రవి ఫ్రెండ్‌ విన్సెంట్‌.. ‘‘దిశ అరెస్టు విషయం నన్ను షాక్‌కు గురిచేసింది. అదే సమయంలో జరిగేది ఇదే కదా అని కూడా అనిపించింది. ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాలను అంతతేలికగా తీసుకోలేం. సోషల్‌ మీడియాలో ఓ పోస్టు పెడితే మీరు అరెస్టు అవుతారు. 

ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే మిమ్మల్ని జైళ్లో పెడతారు. అంతే కదా. దిశకు ఇలా జరిగిందంటే.. మనం కూడా ఏదో ఒకరోజు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోక తప్పదని అర్థమవుతోంది. ఏదేమైనా, అన్యాయానికి వ్యతిరేకంగా గళం విప్పిన దిశకు ఈ సందర్భంగా ధన్యవాదాలు చెబుతున్నా. దిశకు జీవ హింస ఇష్టం ఉండదు. గోవులను వధిస్తే తను తట్టుకోలేదు. అంతేకాదు, వాటి నుంచి పాలు సేకరిస్తూ, ఓ వస్తువులా భావించడం వంటి అంశాలకు తను వ్యతిరేకం. 

అందుకే మొక్కల ఉత్పత్తుల ద్వారానే ఇలాంటి అవసరాలు తీరే ఉద్దేశంతో నెలకొల్పిన కంపెనీలో తను పనిచేస్తోంది. దయచేసి యువత ఉద్దేశం ఏమిటో మీరు అర్థం చేసుకోండి. ప్రభుత్వానికి నేను చేసే విజ్ఞప్తి ఇదొక్కటే. దిశ లాంటి వాళ్లను అరెస్టు చేయాల్సిన అవసరం లేదు. తనతో ఒక్కసారి మాట్లాడి చూడండి. తనేమీ ఎక్కడికి పారిపోవడం లేదు కదా. తను అలాంటి పిరికి మనస్తత్వం కలది కాదు. ఆలోచించండి’’ అని విన్సెంట్‌ ఉద్వేగపూరితంగా మాట్లాడారు. దిశ అరెస్టును ఆయన ఈ సందర్భంగా ఖండించారు.

చదవండిటూల్‌కిట్ కేసు‌ : కీలక విషయాలు వెల్లడి

మరిన్ని వార్తలు